RBI : లోన్స్ ఇప్పుడిక ఈజీ.. బ్యాంకులకు రూ.50 వేల కోట్ల బూస్టర్ డోస్ ఇచ్చిన ఆర్‌బీఐ.

Update: 2025-12-12 06:30 GMT

RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ అంటే నగదు లభ్యతను పెంచడానికి, బ్యాంకుల రుణాలు ఇచ్చే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఓపెన్ మార్కెట్ నుంచి రూ.50,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. ఈ సెక్యూరిటీల కొనుగోలు ద్వారా ఆర్‌బీఐ, బ్యాంకుల వద్ద ఉన్న సెక్యూరిటీలను తీసుకుని, వాటికి బదులుగా నగదును ఇస్తుంది. దీని వలన బ్యాంకుల వద్ద మరింత నగదు అందుబాటులోకి వచ్చి వారు కస్టమర్‌లకు లోన్లు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుగా ప్రకటించిన విధంగా డిసెంబర్ నెలలో మొత్తం రూ.లక్ష కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గురువారం నాడు రూ.50,000 కోట్ల విలువైన కొనుగోలు పూర్తయింది. మిగిలిన రూ.50,000 కోట్ల విలువైన సెక్యూరిటీల కొనుగోలు డిసెంబర్ 18న జరగనుంది.

ఈ సెక్యూరిటీలు 4 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితులు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు 2029లో మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలను 6.75% వడ్డీ రేటుకు ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ప్రధాన లక్ష్యం.. రుణాల వృద్ధిని ప్రోత్సహించడం, దేశంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడం.

బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్న ఆర్‌బీఐ, ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఈ సంవత్సరంలో నాల్గవసారి రెపో రేటును 0.25% తగ్గించింది. దీనితో రెపో రేటు 5.25%కి చేరుకుంది. సంవత్సరం ప్రారంభం నుంచి చూస్తే, రెపో రేటులో మొత్తం 1.25% తగ్గింపు జరిగింది.

రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి అప్పు తీసుకునే వడ్డీ రేటు. ఇది తగ్గడం వలన బ్యాంకులు తక్కువ వడ్డీకే నిధులను పొందగలుగుతాయి. ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు హోమ్ లోన్, ఆటో లోన్ వంటి వాటిపై తక్కువ EMIల రూపంలో కస్టమర్‌లకు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం (4.0%) కంటే తక్కువగా ఉండటం, జీడీపీ వృద్ధి అంచనా కంటే మెరుగ్గా ఉండటం వలన, ఈ నిర్ణయం ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి దోహదపడుతుంది.

Tags:    

Similar News