RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రస్తుత దేశీయ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెపో రేటును 5.5% వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయించారు. వరుసగా ఇది రెండవసారి రెపో రేటులో మార్పు చేయకపోవడం గమనార్హం.
గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పిన 7 కీలక అంశాలు
ఆర్‌బిఐ గవర్నర్ దేశ ఆర్థిక పరిస్థితిపై తటస్థ వైఖరిని కొనసాగిస్తామని ప్రకటించారు.. అంటే ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు రేట్ల విషయంలో సరళతను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన చేసిన 7 ప్రధాన ప్రకటనలు ఇవి:
1. జీడీపీ అంచనాలో భారీ పెంపు
దేశానికి ఇది అతి పెద్ద శుభవార్త. అమెరికన్ హై టారిఫ్‌ల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆర్‌బిఐ దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.5% నుండి 6.8%కి పెంచింది. అదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను కూడా 3.1% నుండి 2.6%కి తగ్గించారు.
2. రుణాల వడ్డీ రేట్లపై ఉపశమనం
రెపో రేటు స్థిరంగా ఉన్నందున, ఇళ్లు, వాహనాలు, ఇతర రిటైల్ లోన్ల వడ్డీ రేట్లలో తక్షణ మార్పులు ఉండకపోవచ్చు. దీనివల్ల రుణాలు తీసుకున్నవారికి కొంత స్థిరత్వం లభిస్తుంది.
3. గత కోత ప్రభావం
ఈ ఏడాది ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఆర్‌బిఐ ఇప్పటికే రెపో రేటును మొత్తంగా 1 శాతం తగ్గించింది. దీని ఫలితంగా కొత్త రుణాల వడ్డీ ఖర్చులో 0.58 శాతం తగ్గుదల కనిపించింది.
4. విదేశీ మారక నిల్వల్లో బలం
భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 700.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ మొత్తం దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతుందని గవర్నర్ తెలిపారు. ఇది దేశ ఆర్థిక బలానికి నిదర్శనం.
5. ఆర్థిక కార్యకలాపాల వేగం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది.
6. వృద్ధికి కీలకాంశాలు
మెరుగైన వర్షపాతం, జీఎస్టీ రేట్ల తగ్గింపు, ఇతర విధానపరమైన చర్యల కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని, అలాగే ఆర్థిక వృద్ధికి కూడా సహాయపడుతుందని గవర్నర్ నమ్మకం వ్యక్తం చేశారు.
7. వేచి చూసే ధోరణి
ప్రస్తుతానికి ఆర్‌బిఐ వేచి చూసే ధోరణిలో ఉంది. అంటే, వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూనే, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై, దేశీయ ఆర్థిక దిశపై నిశితంగా దృష్టి సారిస్తుందని అర్థం. తక్కువ ద్రవ్యోల్బణం, ద్రవ్య సరళత కారణంగా పెట్టుబడి, వినియోగం రెండూ పెరుగుతాయని కేంద్ర బ్యాంకు అభిప్రాయపడింది.