OTP and Authentication : ఓటీపీతోపాటు మరో ఆథెంటికేషన్.. ఆర్బీఐ ప్రపోజల్

Update: 2024-08-02 09:09 GMT

డిజిటల్ లావాదేవీల్లో SMS ఆధారిత ఓటీపీ వ్యవస్థతో పాటు అదనపు అథెంటికేషన్ ప్రక్రియలను ప్రతిపాదిస్తూ రిజర్వ్ బ్యాంక్ ముసాయిదా ఫ్రేమ్ వర్క్ ను విడుదల చేసింది. అథెంటికేషన్ కోసం ప్రత్యేకంగా ఒక పద్ధతినే తప్పనిసరి చేయలేదని ఆర్బీఐ తెలిపింది. చాలా వరకు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు ఎస్ఎం ఎస్ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపింది.

ఓటీపీ వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, సాంకేతికంగా వచ్చిన అభివృద్ధి కారణంగా ప్రత్యామ్నాయ అథెంటికేషన్ వ్యవస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయని వివరించింది.

మరోవైపు ఏదైనా అదనపు అథెంటికేషన్ వ్యవస్థను యాక్టివేట్ చేసేటప్పుడు తప్పనిసరిగా కస్టమర్ అనుమతి తీసుకోవాలని ముసాయిదాలో ఆర్బీఐ తెలిపింది. కొత్త అథెంటికేషన్ వ్యవస్థ నుంచి వైదొలిగే ఏర్పాటు ఇవ్వాలని సూచించింది.

కార్డుతో కూడిన లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ చెల్లింపులన్నీ అథెంటికేషన్ ను కచ్చితంగా ఉపయోగించుకోవాలని సూచించింది. అది కూడా చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన తరువాత సృష్టించిన ఫ్యాక్టర్ ను ఈ ఒక్కసారికి మాత్రమే ఉపయోగించుకునేలా ఉండాలని తెలిపింది. ఒకే ఫ్యాక్టర్ ను పలుమార్లు ఉపయోగించే విధానాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. మరోవైపు డిజిటల్ చెల్లింపులకు అలర్ట్ పంపించడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ముసాయిదాలో ఆర్బీఐ పేర్కొంది. ఈ ముసాయిదాపై సెప్టెంబర్ 15 వరకు అభిప్రాయాలు తెలియచేయాలని ఆర్బీఐ కోరింది.

Tags:    

Similar News