RELIANCE: రిలయన్స్ పవర్‌కు భారీ ప్రాజెక్టు!

సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి భారీ ఆర్డర్‌ను పొందిన రిలయన్స్;

Update: 2025-05-13 04:00 GMT

దేశీయ శక్తి రంగంలో మరో కీలక ముందడుగు వేసిన రిలయన్స్ పవర్‌కు కొత్తగా పెద్ద ఆర్డర్ దక్కింది. కంపెనీ అనుబంధ సంస్థ రిలయన్స్ NU ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ (SJVN) నుంచి 350 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి భారీ ఆర్డర్‌ను పొందింది. ఈ ప్రాజెక్టులో కీలక భాగంగా 175 మెగావాట్లు/700 MWh సామర్థ్యం గల ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’ (BESS) ఏర్పాటు చేయనుంది. ఈ బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ నాలుగు గంటలపాటు విద్యుత్‌ను నిల్వ ఉంచి సరఫరా చేయగల సామర్థ్యంతో ఉంటుంది. పర్యావరణ అనుకూలతతోపాటు, అవసర సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇది కీలకంగా మారనుంది. 25 ఏళ్ల వరకు రూ.3.33 యూనిట్‌కు విద్యుత్‌ ధర నిర్ణయించగా, ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ పవర్ నిర్వహించే సమీకృత ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ టెండర్‌ కోసం మొత్తం 19 సంస్థలు పోటీపడగా.. 18 సంస్థలు మాత్రమే ఇ-రివర్స్ వేలానికి అర్హత సాధించాయి.

మరో మెట్టు ఎక్కిన రిలయన్స్

రిలయన్స్ పవర్ ప్రస్తుతంలో 5,305 మెగావాట్ల ఆపరేటింగ్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఆధారిత సమీకృత విద్యుత్ ప్లాంట్ అయిన 3,960 మెగావాట్ల ససాన్ పవర్ లిమిటెడ్ కూడా భాగమే. ఇటీవలే రిలయన్స్ NU తన శక్తి సామర్థ్యాన్ని మరో మెట్టు ఎక్కించింది. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ +BESS ప్రాజెక్టు అభివృద్ధికి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA)పై సంతకం చేసింది. ఈ ప్రాజెక్టులన్నీ పునరుత్పాదక శక్తిపై భారత నిరంతర కట్టుబాట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. మిషన్ నెట్-జీరో లక్ష్యాలను చేరుకోవడంలో ఇదొక దృఢమైన అడుగగా చెప్పొచ్చు.

Tags:    

Similar News