Reliance : రిలయన్స్‌ లాభం రూ.16,563 కోట్లు

Update: 2024-10-15 13:45 GMT

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభంలో 5% క్షీణతను చవిచూసింది. చమురు రిఫైనింగ్, పెట్రో రసాయనాల వ్యాపారాలు (ఓ2సీ) బలహీనంగా ఉండటం ఇందుకు కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.16,563 కోట్లు (ఒక్కో షేరుకు రూ. 24.48)గా నమోదైంది. 2023-24 ఇదే కాల లాభం రూ.17,394 కోట్ల (ఒక్కో షేరుకు రూ.25.71)తో పోలిస్తే ఇది 5% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. రిటైల్, టెలికాం విభాగాలు రాణించినా, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా మార్జిన్లు తగ్గడంతో ఓ2సీ గణాంకాలు బలహీనంగా నమోదయ్యాయి. అధిక రుణాల వల్ల, ఆర్థిక వ్యయాలు 5% పెరిగి రూ.6017 కోట్లకు చేరడమూ ప్రభావం చూపింది. చమురు- కంపెనీ రుణాలు రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3.36 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం నాటి రూ.3.04 లక్షల కోట్లతో పోల్చినా ఇవి ఎక్కువే. నగదు నిల్వలను పరిగణనలోకి తీసుకుంటే నికర రుణాలు రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. 2023 సెప్టెంబరు ఆఖరుకు నికర రుణాలు రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Tags:    

Similar News