Renault Duster : చరిత్ర సృష్టించడానికి సిద్ధమైన రెనాల్ట్.. షోరూమ్‌కు వచ్చేసిన డస్టర్..డెలివరీ ఎప్పుడంటే ?

Update: 2026-02-20 08:45 GMT

Renault Duster : ఒకప్పుడు భారత రోడ్లపై రారాజులా వెలిగిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ వచ్చేస్తోంది. సరికొత్త అవతారంలో, అదిరిపోయే ఫీచర్లతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఎస్‌యూవీ దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లకు చేరుకోవడం మొదలైంది. పాత డస్టర్‌లోని మొరటుతనం, కొత్త తరం టెక్నాలజీ కలగలిసి వస్తున్న ఈ మోడల్ చూస్తుంటే, ఎస్‌యూవీ మార్కెట్లో మళ్ళీ దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రూ.21,000తో ప్రీ-బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

కొత్త డస్టర్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా మ్యాన్లీగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ముందు భాగంలో ఐబ్రో స్టైల్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, కొత్త గ్రిల్, పాత డస్టర్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా సిల్వర్ ఫినిషింగ్ ఉన్న బంపర్ ఉన్నాయి. వెనుక వైపు వై-షేప్ టెయిల్ లైట్స్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. లోపలికి వెళ్తే.. ఇంటీరియర్ మొత్తం మారిపోయింది. పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు కారును నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి కీలక ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

ఇంజిన్ ఆప్షన్ల విషయంలో రెనాల్ట్ ఎక్కడా తగ్గలేదు. ఇందులో మూడు రకాల ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజీ ముఖ్యం అనుకునే వారి కోసం 1.8 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ (160 BHP) ఉంది. స్పీడ్, పవర్ కావాలనుకునే వారి కోసం 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 BHP/280 Nm) అందుబాటులో ఉంది. ఇక సిటీలో తిరిగే వారి కోసం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ముఖ్యంగా టర్బో పెట్రోల్ వేరియంట్లు డ్రైవింగ్ ప్రియులకు పిచ్చెక్కించడం ఖాయం.

డెలివరీల విషయానికి వస్తే.. మార్చి 2026 మధ్యలో ఈ కారు ధరలను అధికారికంగా ప్రకటిస్తారు. వెంటనే టర్బో పెట్రోల్ వేరియంట్ల డెలివరీలు మొదలవుతాయి. అయితే హైబ్రిడ్ వేరియంట్ కోసం మాత్రం దీపావళి 2026 వరకు ఆగాల్సిందే. పాత డస్టర్ యజమానుల కోసం గ్యాంగ్ ఆఫ్ డస్టర్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. మీరు కూడా ఈ కొత్త డస్టర్‌ను చూడాలనుకుంటే మీ దగ్గర్లోని డీలర్‌ను సంప్రదించవచ్చు.

Tags:    

Similar News