Royal Enfield : దేశంలోనే మొట్టమొదటిసారి..పాత బైకుల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలన నిర్ణయం.

Update: 2026-02-20 08:45 GMT

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అంటే మన భారతీయులకు ఒక ఎమోషన్. దశాబ్దాలుగా ఈ బైకులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. అయితే మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతోంది. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం) వాడకాన్ని తప్పనిసరి చేస్తోంది. దీనివల్ల పాత BS3, BS4 మోడల్ బైకులు ఉన్నవారు తమ ఇంజిన్ల పరిస్థితి ఏంటో అని తెగ కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే ఇథనాల్ శాతం పెరిగితే పాత ఇంజిన్లలోని రబ్బర్ సీల్స్, పైపులు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ టెన్షన్‌ను దూరం చేసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఒక అదిరిపోయే పరిష్కారాన్ని తీసుకొచ్చింది.

పాత బుల్లెట్ ప్రేమికుల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకంగా E20 కంపాటబుల్ కార్బొరేటర్ కిట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, ఎలక్ట్రా, థండర్ బర్డ్ వంటి పాత మోడళ్లకు ఈ కొత్త కిట్లు చక్కగా సరిపోతాయి. వీటి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయి. BS3 మోడళ్ల కోసం సుమారు రూ.3,000, BS4 మోడళ్ల కోసం రూ.4,000 గా నిర్ణయించారు. ఇక 500 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ మోడల్స్ వాడే వారి కోసం అప్‌డేటెడ్ ఇంజెక్టర్లను సుమారు రూ.2,500కే అందిస్తున్నారు. ఈ చిన్న మార్పుతో మీ పాత బుల్లెట్ కొత్త ఇంధనానికి సిద్ధమైపోతుంది.

అసలు ఈ E20 పెట్రోల్ వల్ల వచ్చే చిక్కేంటో తెలుసా? ఇథనాల్‌కు తేమను (మాయిశ్చర్) పీల్చుకునే గుణం ఉంటుంది. ఇది సాధారణ పెట్రోల్ కంటే వేగంగా రియాక్ట్ అవుతుంది. దీనివల్ల పాత బైకుల్లోని ప్లాస్టిక్ పార్ట్స్, రబ్బరు పైపులు గట్టి పడిపోవడం లేదా ఉబ్బిపోయి పగిలిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీ కొత్త కిట్లలో నాణ్యమైన సీల్స్, దృఢమైన రబ్బరు భాగాలను వాడింది. కార్బొరేటర్ ట్యూనింగ్‌ను కూడా మార్చింది. అయితే ఇథనాల్ వల్ల శక్తి ఉత్పత్తి కొంచెం తగ్గుతుంది కాబట్టి మైలేజీలో స్వల్ప మార్పు ఉండవచ్చు.

మరోవైపు బజాజ్ ఆటో వంటి కంపెనీలు కూడా తమ పాత బైక్ వినియోగదారుల కోసం ఒక చౌకైన చిట్కాను సూచిస్తున్నాయి. కేవలం రూ.80 నుంచి రూ.100లకే దొరికే ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ వాడటం వల్ల ఇథనాల్ ప్రభావం ఇంజిన్‌పై పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ యూజర్లు మాత్రం కంపెనీ సూచించిన కిట్లను వాడటం వల్ల ఇంజిన్ లైఫ్ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీ పాత బుల్లెట్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే ఈ చిన్న అప్‌డేట్ చేయించుకోవడం మంచిది.

Tags:    

Similar News