Hyundai Exter : టాటా పంచ్‌కు చెమటలు పట్టించేందుకు హ్యుందాయ్ ప్లాన్.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎక్స్‌టర్.

Update: 2026-02-20 09:00 GMT

Hyundai Exter : టాటా పంచ్‎కు గట్టి పోటీనిచ్చేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా సిద్ధమవుతోంది. ఆ కంపెనీకి చెందిన మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ దశలో ఉండగా, భారత్‌తో పాటు దక్షిణ కొరియా రోడ్లపై కూడా కెమెరాలకు చిక్కింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త హంగులు, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు రానుండటంతో వాహన ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఉన్న డిజైన్ సిల్హౌట్‌ను హ్యుందాయ్ అలాగే కొనసాగించినప్పటికీ, గ్రిల్, బంపర్, లైటింగ్ ఎలిమెంట్లలో సూక్ష్మమైన మార్పులు చేసే అవకాశం ఉంది. హెచ్-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, టెయిల్ లైట్స్ అలాగే ఉండవచ్చు. అయితే కొత్త డిజైన్ గల అలాయ్ వీల్స్, మరికొన్ని కాస్మెటిక్ మార్పులు ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సరికొత్త రూపాన్ని ఇవ్వనున్నాయి. ముఖ్యంగా ఈ కారు క్యాబిన్ లోపల లగ్జరీ ఫీచర్లను పెంచేందుకు హ్యుందాయ్ మొగ్గు చూపుతోంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 12 అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అప్‌డేటెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చని సమాచారం. అలాగే తొలిసారిగా ఈ సెగ్మెంట్లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక వైపు సన్ షేడ్స్, మెరుగైన కనెక్టెడ్ కార్ టెక్నాలజీని ఆశించవచ్చు. సేఫ్టీ పరంగా ఇప్పటికే ఎక్స్‌టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తున్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అదనంగా ఏడీఏఎస్ వంటి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను కూడా జోడించే అవకాశం ఉంది.

ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (83 PS పవర్, 113.8 Nm టార్క్)నే హ్యుందాయ్ కొనసాగించనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ (AMT) గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అలాగే ఎకానమీ కోరుకునే వారి కోసం సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. 2026 మధ్య నాటికి ఈ కారు భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News