Tata Sierra : మారుతి, హ్యుందాయ్‌లకు సవాల్.. టాటా సియెర్రాలో టాప్ 5 టెక్ ఫీచర్లు ఇవే.
Tata Sierra : దశాబ్దాల క్రితం వచ్చిన టాటా సియెర్రా ఇప్పుడు పూర్తిగా కొత్త స్టైల్, ఫీచర్లతో తిరిగి రాబోతోంది. నవంబర్ 25 న భారత మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీలో కంపెనీ అనేక మోడ్రన్ ఫీచర్లను అందించింది. ఈ కారు కోసం ఎదురుచూస్తున్న కస్టమర్ల కోసం, లాంచ్‌కు ముందే ఇందులో ఉన్న టాప్ 5 ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఫీచర్లు మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒక ట్రెండ్‌ను సెట్ చేయబోతున్నాయి అనడంలో సందేహం లేదు.
1. లెవెల్ 2 అడాస్ సేఫ్టీ
కొత్త తరం టాటా సియెర్రాలో ఇప్పటికే హారియర్, సఫారీలో ఉన్నట్లుగా లెవెల్ 2 ADAS సేఫ్టీ సిస్టమ్ అందించారు.ఈ సిస్టమ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక కీలకమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి భద్రత, సౌకర్యాన్ని అందిస్తుంది.
2. ట్రిపుల్-స్క్రీన్ సెటప్
సియెర్రా ఇంటీరియర్ లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఇదే. ఈ ఎస్‌యూవీలో ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంది. ఇందులో డ్రైవర్ కోసం డిజిటల్ డిస్‌ప్లే, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేక స్క్రీన్ ఉన్నాయి. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ విధంగా మూడు స్క్రీన్‌లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి, మొదటి కారు కావడం విశేషం. ఈ స్క్రీన్‌లలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
3. 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా
పోటీ కంపెనీల కార్లను వెనక్కి నెడుతూ టాటా సియెర్రాలో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా ఫీచర్‌ను ఇచ్చారు. ఇరుకైన పార్కింగ్ స్థలాల్లో కారును పార్క్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కారు చుట్టూ ఉన్న పరిసరాలను పూర్తిగా స్క్రీన్‌పై చూపించడం ద్వారా డ్రైవింగ్ అనుభవాన్ని, భద్రతను మెరుగుపరుస్తుంది.
4. పనోరమిక్ సన్‌రూఫ్
నేటి మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ కార్లలో పనోరమిక్ సన్‌రూఫ్ అనేది ఒక తప్పనిసరి ఫీచర్‌గా మారింది. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ కొత్త టాటా సియెర్రాలో కూడా పెద్ద పనోరమిక్ గ్లాస్ రూఫ్ ను అందించారు. అయితే ఈ ఫీచర్ అత్యధిక ధర ఉన్న వేరియంట్‌లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
5. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్
టాటా మోటార్స్ కొత్త సియెర్రాలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా, డ్రైవర్, పక్కన కూర్చున్న ప్యాసింజర్ తమ సౌలభ్యాన్ని బట్టి ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతను వేర్వేరుగా సెట్ చేసుకోవచ్చు. ఈ ప్రీమియం ఫీచర్ హారియర్, సఫారీ కార్లలో కూడా అందుబాటులో ఉంది.