Reverse Mortgage Scheme : ఇల్లు అమ్ముకోకుండానే నెల నెలా డబ్బు.. వృద్ధుల పాలిట వరం రివర్స్ మార్ట్‌గేజ్ స్కీమ్.
Reverse Mortgage Scheme : వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా, పిల్లలు దూరంగా ఉన్నప్పుడు లేదా ఆర్థికంగా ఆధారపడలేని పరిస్థితుల్లో సొంత ఇల్లు ఉన్నా డబ్బుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వారికోసమే ఈ రివర్స్ మార్ట్‌గేజ్ పథకం. ఇది మీ ఇంటిని అమ్ముకోకుండానే మీకు ప్రతి నెలా ఆదాయాన్ని అందిస్తుంది.
ఏమిటీ రివర్స్ మార్ట్‌గేజ్ స్కీమ్?
సాధారణంగా హోమ్ లోన్ అంటే మనం ఈఎంఐ కడతాం కదా, దీనికి ఇది పూర్తిగా రివర్స్. అంటే, మీ ఇంటి ఆస్తి పత్రాలను బ్యాంకుకు అప్పగిస్తే, బ్యాంకు మీకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఈఎంఐలాగా చెల్లిస్తుంది. మీరు బ్రతికి ఉన్నంత కాలం, మీ ఇంట్లోనే ఎలాంటి అద్దె కట్టకుండా హాయిగా జీవించవచ్చు. ఆర్థికంగా స్థిరపడని వృద్ధులకు, పెన్షన్ లేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఎంత ఆదాయం పొందవచ్చు?
చాలా బ్యాంకులు ఈ రివర్స్ మార్ట్‌గేజ్ సేవలను అందిస్తున్నాయి. 60 సంవత్సరాలు దాటిన, సొంత ఇల్లు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. బ్యాంకులు మీ వయస్సు, మీ ఇంటి మార్కెట్ విలువను బట్టి ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తాయి. ఉదాహరణకు.. మీ ఇంటి విలువ 50 లక్షలు ఉండి, మీ వయస్సు 60 సంవత్సరాలు అయితే, నెలకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ఇవ్వడానికి బ్యాంకులు ఒప్పుకోవచ్చు. మీ వయస్సు ఎక్కువ ఉంటే, ఇంకా ఎక్కువ మొత్తాన్ని కూడా పొందవచ్చు.
ఎంత కాలం ఈ ఆదాయం వస్తుంది?
ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మీరు బ్రతికి ఉన్నంత కాలం, అంటే జీవితాంతం ప్రతి నెలా మీకు ఆదాయం అందించడం. ఇది ఒక రకంగా పెన్షన్ లాగా పనిచేస్తుంది. మీరు బ్రతికి ఉన్నంత కాలం మీ ఇంట్లోనే ఉండవచ్చు. ఈ పథకానికి RBI ఆమోదం ఉంది. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ పథకాన్ని అందిస్తున్నాయి.
బ్యాంకులకు లాభం ఏమిటి?
ఇక్కడ బ్యాంకులకు కూడా లాభం ఉంటుంది. మీరు చనిపోయిన తర్వాత, ఆస్తి పత్రాలు బ్యాంకు దగ్గరే ఉంటాయి కాబట్టి, ఆ ఇంటిని బ్యాంకు వేలం వేసి అమ్ముతుంది. మీరు తీసుకున్న మొత్తం, దానికి సంబంధించిన వడ్డీని బ్యాంకు తీసేసుకుంటుంది. ఒకవేళ ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు మిగిలితే, ఆ వ్యక్తి వారసులకు ఆ డబ్బును అందజేస్తుంది.