Rupee : భారత కరెన్సీ రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. అమెరికన్ డాలర్ ఎదుట రూపాయి విలువ శుక్రవారం రోజున చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ తొలిసారిగా 89 మార్కును దాటింది. ఫారెక్స్ మార్కెట్‌లో ఒక డాలర్ విలువ రూ.89.55కి చేరింది. ట్రేడింగ్‌లో ఒకానొక దశలో రూపాయి విలువ రూ.89.65 కి కూడా పడిపోయింది. ఈ పతనం రూపాయి చరిత్రలోనే అతి తక్కువ విలువగా నమోదైంది. గతంలో సెప్టెంబర్ నెల చివరిలో డాలర్ ఎదుట రూపాయి విలువ రూ.88.80 వద్ద కనిష్ఠంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఇదే విధంగా కొనసాగితే ఒకటి-రెండు రోజుల్లో ఒక డాలర్ విలువ రూ.90 మార్కును దాటినా ఆశ్చర్యం లేదు.
రూపాయి పతనానికి గల కారణాలు
దశాబ్దాలుగా డాలర్ ఎదుట రూపాయి విలువ తగ్గుతూ వస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ పతనం చాలా వేగంగా ఉండటం గమనార్హం. దీనికి నిపుణులు ఈ కింది అంశాలను కారణంగా చెబుతున్నారు. ఇరాన్ చమురు వ్యాపారంలో పాల్గొంటున్న భారతీయ సంస్థలపై అమెరికా నిషేధాలు విధించడం రూపాయికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. టారిఫ్‌ల కారణంగా భారత ఎగుమతులు 11.8 శాతం మేర తగ్గిపోయాయి. బంగారు దిగుమతి భారీగా పెరగడం వలన భారతదేశ ట్రేడ్ డెఫిసిట్ (వ్యాపార లోటు) పెరిగింది. ఈ రెండు అంశాలు రూపాయిని మరింత బలహీనపరిచాయి.
విదేశీ పెట్టుబడుల ప్రభావం
రూపాయి అత్యంత బలహీనంగా ఉన్న ఆసియా కరెన్సీల జాబితాలో చేరింది. అమెరికా టారిఫ్ చర్యలు మొదలైనప్పటి నుంచే రూపాయిపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు, విదేశీ సంస్థాగత మదుపరులు ఈ సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్ నుంచి సుమారు 16.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం రూపాయిపై నిరంతర ఒత్తిడిని పెట్టింది. అంతర్జాతీయంగా డాలర్ బలం పెరుగుతూ ఉండటం, టారిఫ్‌ల ప్రభావం వంటి వివిధ అంశాలు కూడా రూపాయి విలువకు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి.