Rupee : పడిపోతున్న రూపాయి..విదేశీ పేమెంట్లు చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన లెక్కలివి.
Rupee : కేంద్ర బ్యాంక్ జోక్యం చేసుకోవడంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, విదేశీ చెల్లింపులు (డాలర్లలో) చేసే సామాన్య ప్రజలపై దాని ప్రభావం తగ్గడం లేదు. విదేశీ విద్య ఫీజులు, పర్యటనలు, వీసా ఫీజులు లేదా ఏదైనా గాడ్జెట్ ఆర్డర్ వంటి డాలర్ చెల్లింపులు చేసేవారికి రూపాయి విలువ పతనం వల్ల ఖర్చు పెరుగుతుంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు రూపాయి విలువ 4.1 శాతం పడిపోయినప్పటికీ, డిసెంబర్ చివరి నాటికి రూ. 90 మార్కు వద్ద స్థిరపడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 2026 చివరి నాటికి రూపాయి 88.50 డాలర్లకు బలపడవచ్చని చాలా మంది భావిస్తున్నారు. కాగా గత వారం 91.10 స్థాయికి చేరి లైఫ్‌టైమ్ కనిష్టాన్ని తాకిన రూపాయి, ఆర్‌బీఐ జోక్యం తర్వాత 1.3 శాతం బలపడి 89.29 వద్ద స్థిరపడింది.
మీరు త్వరలో డాలర్లలో చెల్లింపు చేయాల్సి వస్తే, డాలర్ విలువను రూ. 90 బేస్‌గా తీసుకుని బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడం సురక్షితం. అమెరికన్ డాలర్-రూపాయి రేటులో వచ్చే ప్రతి రూ.1 మార్పు కూడా మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, మీరు $3,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటే, రూపాయి విలువలో రూ. 1 మార్పు వస్తే, మీ ఖర్చు రూ.3,000 పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఈ లెక్కింపు ద్వారా మీరు బడ్జెట్‌లో రూపాయి హెచ్చుతగ్గులు కోసం ఒక పరిమితిని కేటాయించవచ్చు. ఉదాహరణకు, $500 చెల్లింపుకు, 88.50 రేటు వద్ద రూ. 44,250 అవసరం కాగా, 91.00 రేటు వద్ద రూ. 45,500 అవసరమవుతుంది. అందువల్ల మీరు చేయబోయే చెల్లింపుల తేదీని బట్టి వివిధ బ్యాంకులు ఇచ్చిన 88.50 నుంచి 91.00 వరకు ఉన్న అంచనా రేట్లలో గరిష్ట పరిమితిని బడ్జెట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.
ఆర్‌బీఐ డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. రూపాయి విలువ ఒకవైపు మాత్రమే పడిపోవడాన్ని కేంద్ర బ్యాంక్ సహించదని, ఇది ఊహాజనిత కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆర్‌బీఐ జోక్యం సామర్థ్యం పరిమితంగా ఉండవచ్చు. కాబట్టి ఆర్‌బీఐ చర్య తీసుకుంటున్నప్పటికీ, రిస్క్ పూర్తిగా తొలగిపోలేదు. మీరు వ్యాపారులు కాకపోయినా, మీ చెల్లింపు తేదీ నిర్ణీతమైతే, బడ్జెట్ తయారుచేసేటప్పుడు డాలర్ హెచ్చుతగ్గుల కోసం ఒక నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించడం, అనవసరమైన ఆర్థిక భారాన్ని నివారించడానికి చాలా కీలకం.