Russia Oil Ban : రిలయన్స్‌కు ఎదురుదెబ్బ.. రష్యా చమురుపై నిషేధం.. భవిష్యత్ ప్రణాళిక ఇదే.
Russia Oil Ban : భారతదేశంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రష్యా చమురు రిఫైన్డ్ ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా విధించిన తాజా ఆంక్షలపై శుక్రవారం కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యకు ప్రతిస్పందనగా, రష్యాకు చెందిన ప్రముఖ చమురు కంపెనీలైన రోస్‌నెఫ్ట్, లుకోయిల్ పై కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ప్రభావం దాని అనుగుణంగా తమ కార్యకలాపాలను ఎలా మార్చుకోవాలనే దానిపై రిలయన్స్ ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాగా ప్రస్తుతం రిలయన్స్ రోస్‌నెఫ్ట్‌తో రోజుకు దాదాపు 500,000 బ్యారెళ్ల చమురు కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం కలిగి ఉంది.
రష్యా చమురు, రిఫైన్డ్ ఉత్పత్తులపై ఇటీవల యూరోపియన్ యూనియన్, యూకే, అమెరికా విధించిన ఆంక్షలను తాము గమనించినట్లు రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త నిషేధాల ప్రభావం, కొత్త నియంత్రణ అవసరాలపై రిలయన్స్ ప్రస్తుతం లోతుగా పరిశీలిస్తోంది. యూరప్‌కు రిఫైన్డ్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి యూరోపియన్ యూనియన్ మార్గదర్శకాలను తాము ఖచ్చితంగా పాటిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు వచ్చినా, వాటిని పూర్తిగా అమలు చేస్తామని రిలయన్స్ తెలిపింది. తాము ఎల్లప్పుడూ భారత ఇంధన భద్రతను నిర్ధారించే లక్ష్యంతోనే చర్యలు తీసుకుంటామని రిలయన్స్ పునరుద్ఘాటించింది. రిలయన్స్ అన్ని ఆంక్షలు, నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. కంపెనీ తన రిఫైనరీ కార్యకలాపాలను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకుంటుంది. మార్కెట్, నియంత్రణలలో మార్పులకు అనుగుణంగా చమురు సరఫరా కాంట్రాక్టులు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని కంపెనీ పేర్కొంది.
రిలయన్స్ తన సరఫరాదారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే ఈ మార్పులను అమలు చేయనున్నట్లు తెలిపింది. అమెరికా విధించిన ఆంక్షలు రష్యా తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించే వ్యూహంలో భాగమని తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని కూడా రద్దు చేశారు.