Post Office Scheme : పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.20 వేలు మీ సొంతం.
Post Office Scheme : రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా చేతికి కొంత డబ్బు వస్తే ఎంత బాగుంటుందో కదా. ఉద్యోగం చేసేటప్పుడు జీతం వచ్చినట్లుగా, విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ స్కీమ్, వృద్ధాప్యంలో పెన్షన్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా గడిపేలా చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మిగతా పథకాలతో పోలిస్తే ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటమే దీని ప్రత్యేకత.
ఏమిటి ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్?
ఈ పథకాన్ని ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన భారతీయుల కోసం రూపొందించారు. రిటైర్ అయ్యాక తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని భద్రంగా దాచుకోవడంతో పాటు, దానిపై క్రమం తప్పకుండా ఆదాయం పొందడానికి ఇది సరైన వేదిక. 60 ఏళ్లు పైబడిన వారే కాకుండా, 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక రక్షణ రంగంలో పనిచేసి రిటైర్ అయిన వారు 50 ఏళ్లకే ఈ అకౌంట్ తెరిచే వెసులుబాటు ఉంది. మీరు వ్యక్తిగతంగా లేదా మీ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? కాలపరిమితి ఎంత?
ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఒక వ్యక్తి రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ పరిమితిని ప్రభుత్వం ఇటీవలే పెంచింది, ఇది రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఊరట. ఈ అకౌంట్ కాలపరిమితి 5 ఏళ్లు. ఒకవేళ మీకు ఇంకా కొనసాగించాలని ఉంటే, మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 8 ఏళ్ల పాటు మీ డబ్బుపై అధిక వడ్డీని పొందవచ్చు.
నెలకు రూ. 20,500 ఆదాయం..
ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 8.2 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకొకసారి (ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిలో) మీ అకౌంట్‌లో జమ చేస్తారు. ఒకవేళ మీరు గరిష్ట పరిమితి అయిన రూ. 30 లక్షలను ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే వార్షిక వడ్డీ రూ. 2,46,000 అవుతుంది. దీనిని 12 నెలలకు విభజిస్తే, నెలకు దాదాపు రూ. 20,500 మీ చేతికి వస్తుంది. అంటే ఎటువంటి రిస్క్ లేకుండా, ప్రభుత్వ హామీతో ప్రతి నెలా మీ ఖర్చుల కోసం గౌరవప్రదమైన మొత్తం లభిస్తుంది.
ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా
కేవలం వడ్డీయే కాదు, ఈ పథకం ద్వారా పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు పెట్టిన పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే, మీకు వచ్చే వడ్డీ ఏడాదికి రూ.50,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఒకవేళ మీ మొత్తం ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే, ఫామ్ 15H సమర్పించి ఆ పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు. సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ కావాలనుకునే సీనియర్ సిటిజన్స్‌కు ఇది ఒక వరం లాంటిది.