Upcoming Sedans : ఎస్‌యూవీల పని ఖతం? రాజసం ఉట్టిపడేలా వస్తున్న కొత్త సెడాన్లు.
Upcoming Sedans : ప్రస్తుతం మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, సెడాన్ కార్లకు ఉండే రాజసం, క్రేజ్ వేరు. అందుకే సెడాన్ ప్రియుల కోసం 2026 ఏడాది ఒక విందు భోజనంలా మారబోతోంది. ఈ ఏడాది హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, స్కోడా స్లావియా వంటి టాప్ మోడల్స్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో మెరిసిపోవడానికి సిద్ధమవుతున్నాయి. అధునాతన ఫీచర్లు, అప్‌డేటెడ్ లుక్స్‌తో రానున్న ఈ కార్ల వివరాలు చూద్దాం.
హ్యుందాయ్ వెర్నా ప్రస్తుత మోడల్ 2023లో లాంచ్ అయ్యింది. కొందరికి దీని డిజైన్ నచ్చగా, మరికొందరు పెదవి విరిచారు. అయితే, రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విదేశాల్లో అమ్ముడవుతున్న లేటెస్ట్ సోనాటా నుంచి ప్రేరణ పొంది రూపొందుతోంది. ఇంటీరియర్‌లో 12.3 ఇంచుల రెండు కర్వ్డ్ డిస్‌ప్లేలు సింగిల్ బెజెల్‌లో ప్యాక్ చేసి రానున్నాయి. ఇది కాకుండా కొత్త స్టీరింగ్ వీల్, మరిన్ని అడ్వాన్స్‌డ్ ADAS ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఇంజిన్ ఆప్షన్లలో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్
స్కోడా తన స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో (Q4) లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ఎక్స్‌టీరియర్ లో షార్ప్ స్టైలింగ్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు హైలైట్‌గా నిలవనున్నాయి. లోపల సరికొత్త కలర్ స్కీమ్, ప్రీమియం మెటీరియల్ వాడనున్నారు. ముఖ్యంగా వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మసాజ్ ఫంక్షన్ కూడా లభించే ఛాన్స్ ఉంది. ఇక గేర్‌బాక్స్ విషయానికొస్తే.. ప్రస్తుత 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ వచ్చే అవకాశం ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్
స్లావియా లాగే వర్టస్ కూడా సరికొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇది స్లావియా ప్లాట్‌ఫారమ్ (MQB A0 IN) పైనే తయారవుతున్నందున ఫీచర్లు దాదాపు సమానంగా ఉంటాయి. ఇందులో కొత్త గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ రానున్నాయి. ఇంటీరియర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ చేయనుంది. సెడాన్లలో విలాసాన్ని కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్
సెడాన్ల రారాజు హోండా సిటీ కూడా ఈ ఏడాది బరిలోకి దిగుతోంది. అయితే ఇది కేవలం టెంపరరీ అప్‌డేట్ మాత్రమే. ఎందుకంటే హోండా తన నెక్స్ట్ జనరేషన్ సిటీని 2028లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అప్పటిదాకా మార్కెట్ లో ఉన్న వెర్నా, స్లావియా వంటి గట్టి పోటీని తట్టుకోవడానికి ఈ ఫేస్‌లిఫ్ట్ ఉపయోగపడనుంది. ఇందులో కాస్మెటిక్ మార్పులతో పాటు మరిన్ని కనెక్టెడ్ కార్ ఫీచర్లను హోండా జత చేయబోతోంది.