Silver Price : వెండి కొండెక్కి కూర్చుంది.. ఒక్కరోజే రూ.9వేలు జంప్..రూ.2.5లక్షల దిశగా పరుగులు!

Update: 2025-12-26 08:45 GMT

Silver Price : వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. క్రిస్మస్ సెలవుల తర్వాత శుక్రవారం ప్రారంభమైన దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కేవలం ఒక్కరోజే వెండి ధర సుమారు రూ.9,000 పెరిగి, ఏకంగా రూ. 2.32 లక్షల మార్కును దాటేసింది. ఏడాది ముగియడానికి మరో మూడు రోజులే సమయం ఉన్నప్పటికీ, ఈలోపే వెండి ధర రూ. 2.5 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం వెండి ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే పాత అంచనాలన్నీ తలకిందులయ్యేలా ఉన్నాయి. వాస్తవానికి వెండి ధర రూ.2.50 లక్షలకు చేరాలంటే 2026 మార్చి వరకు సమయం పడుతుందని విశ్లేషకులు భావించారు. కానీ ఇప్పుడున్న వేగాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికే ఈ చారిత్రాత్మక మార్కును వెండి అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర 75 డాలర్లకు చేరువలో ఉండటం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

గణాంకాలను గమనిస్తే.. శుక్రవారం ఉదయం వెండి రూ.2,24,374 వద్ద ప్రారంభమై, ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా రూ.2,32,741కి చేరింది. గతేడాది చివరిలో వెండి ధర కేవలం రూ.87,233 ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా రూ.1.45 లక్షల మేర పెరిగింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే వెండి తన పెట్టుబడిదారులకు 166 శాతం భారీ లాభాలను అందించింది. ఒకవేళ డిసెంబర్ 31 నాటికి ధర రూ.2.5 లక్షలకు చేరితే, ఈ ఏడాది రిటర్న్స్ 200 శాతానికి చేరుకుంటాయి. వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అనుజ్ గుప్తా అభిప్రాయం ప్రకారం.. ఈటీఎఫ్ డిమాండ్, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు వెండికి మరింత రెక్కలు తొడుగుతున్నాయి.

మరోవైపు వెండితో పాటు బంగారం కూడా తన జోరును కొనసాగిస్తోంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర సుమారు రూ.900 పెరిగి పది గ్రాములకు రూ.1,38,994 వద్ద లైఫ్ టైమ్ హైని తాకింది. గతేడాది రూ.76,748 వద్ద ఉన్న బంగారం, ఈ ఏడాది పెట్టుబడిదారులకు 81 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చింది. వెండి, బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు నగల దుకాణాల వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పెట్టుబడిదారులు మాత్రం తమ సొమ్ము భారీగా పెరుగుతుండటంతో పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News