Silver Price : 46 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వెండి.. తొలిసారి రూ.2 లక్షలు దాటిన ధర.
Silver Price : ప్రస్తుత సంవత్సరంలో వెండి అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఏకంగా 120 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ భారీ పెరుగుదల కారణంగా శుక్రవారం దేశీయ మార్కెట్‌లో వెండి ధర తొలిసారిగా రూ.2,00,000 మార్కును దాటింది. ఈ జోరుతో వెండి 46 ఏళ్ల పాత రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకుముందు 1979 తర్వాత వెండి ధరలో ఇంత పెద్ద పెరుగుదల ఎప్పుడూ నమోదు కాలేదు. అయితే వెండి ధరలో ఈ పెరుగుదల ఇంతటితో ఆగిపోయే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజమైన సరఫరా కొరత కారణంగా వచ్చే ఏడాదిలో వెండి ధర రూ.2,40,000 – 2,50,000 లక్షల లక్ష్యాన్ని చేరుకుంటుందని అంటే మరో 25% పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు.
వెండి ధర ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం భౌతిక కొరత, పెరుగుతున్న డిమాండే. ప్రపంచ గనుల ఉత్పత్తి పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగలేదు. ఇది ఐదేళ్ల క్రితం స్థాయిలోనే లేదా అంతకంటే తక్కువగా సుమారు 810 మిలియన్ ఔన్సుల వద్ద స్థిరంగా ఉంది. దాదాపు 70-80 శాతం వెండి సీసం, జింక్, రాగి ఉప-ఉత్పత్తిగా లభిస్తుంది.
రిఫినిటివ్ గణాంకాల ప్రకారం.. వెండి సరఫరాలో కొరత 2026 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇది దాదాపు 112 మిలియన్ ఔన్సులుగా అంచనా వేయబడింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పారిశ్రామిక డిమాండే అని బ్రోకరేజ్ సంస్థలు నమ్ముతున్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా ఈ డిమాండ్ వేగంగా పెరిగింది. గత నాలుగేళ్లుగా సోలార్ ఫోటోవోల్టాయిక్ (పీవీ) రంగం నుంచి వెండికి డిమాండ్ రెట్టింపు అయింది. 2020లో 94.4 మిలియన్ ఔన్సులుగా ఉన్న డిమాండ్ 2024 నాటికి 243.7 మిలియన్ ఔన్సులకు పెరిగింది. 2024లో మొత్తం వెండి డిమాండ్‌లో సోలార్ ఎనర్జీ ఒక్కటే దాదాపు 21 శాతం వాటాను కలిగి ఉంది.
దేశీయ మార్కెట్‌లో వెండి ధర రూ. 1,70,000–1,78,000 పరిధిలోకి పడిపోతే, దశలవారీగా కొనుగోలు చేయడానికి ఇది మంచి అవకాశం అని, 2026 నాటికి లక్ష్యం దాదాపు రూ. 2,40,000 గా ఉంటుందని ఆక్సిస్ డైరెక్ట్ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో భౌతిక కొరత, పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడులపై కొత్తగా పెరుగుతున్న ఆసక్తి కారణంగా 2026లో కూడా వెండి ధర రూ. 2,50,000 మార్కును చేరుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.