Silver Price : వెండి ధరలు ఇక అంతేనా? ఆకాశం నుంచి పాతాళానికి పడిపోతాయా?

Update: 2026-01-19 06:15 GMT

Silver Price : వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లి.. ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దిగివస్తున్నాయి. గత వారం రికార్డు స్థాయి గరిష్టాల నుంచి వెండి ధర భారీగా పతనమవ్వడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు మారడం వంటి కారణాలతో వెండిపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఒక్క వారం వ్యవధిలోనే వెండి ధర రికార్డు గరిష్ట స్థాయి 93.70 డాలర్ల నుంచి దాదాపు 5.5 శాతం మేర తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‎లో శుక్రవారం ఒక్కరోజే వెండి ధర 4.15 శాతం మేర తగ్గి 88.537 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు ఆశాజనకంగా ఉండటం, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గడం వల్ల వెండి ధరలపై ప్రభావం పడింది. అంతేకాకుండా, షికాగో మెర్కంటైల్ ఎక్స్ఛేంజ్ వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై మార్జిన్‌ను 45 శాతానికి పెంచింది. అంటే ఎక్కువ డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండటంతో కొత్తగా కొనేవారు వెనకడుగు వేస్తున్నారు. దీనివల్ల వెండి ధరలు మున్ముందు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల విశ్లేషణ.

గత చరిత్రను పరిశీలిస్తే.. 1980లో హంట్ బ్రదర్స్ కాలంలో వెండి ధరలు విపరీతంగా పెరిగి, ఆ తర్వాత 49 డాలర్ల నుంచి ఏకంగా 11 డాలర్లకు పడిపోయాయి. అలాగే 2011లో కూడా పీక్ స్టేజికి చేరిన తర్వాత వెండి ధరలో 75 శాతం మేర పతనం కనిపించింది. ఇప్పుడు కూడా వెండి-బంగారం రేషియో 52 కంటే తక్కువకు పడిపోయింది. అంటే బంగారం కంటే వెండి ధరలు చాలా వేగంగా పెరిగాయని అర్థం. ఇలాంటి సమయంలో మార్కెట్ కరెక్షన్‌కు (ధర తగ్గడానికి) గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎంసీఎక్స్ మార్కెట్ ప్రకారం.. కిలో వెండి ధర రూ.2.70 లక్షల కంటే దిగువకు చేరితే ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ) మొదలై ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. అయితే, వెండికి అంతర్జాతీయంగా 82-83 డాలర్ల వద్ద బలమైన సపోర్ట్ ఉంది. ఒకవేళ మళ్ళీ పుంజుకుని 92 డాలర్ల పైకి చేరితే మాత్రం ధరలు 95 నుంచి 100 డాలర్ల వరకు వెళ్లవచ్చు. ప్రస్తుతం వెండి మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి, సామాన్య ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News