Silver Price : వెండి ఊచకోత..550 గంటల్లోనే రూ.లక్ష పెరుగుదల..ఇది చరిత్రలో ఎప్పుడూ జరగని రికార్డు
Silver Price : వెండి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. 2025లో కూడా చూడని వింత పోకడలు 2026 ప్రారంభంలోనే కనిపిస్తున్నాయి. కేవలం 23 రోజుల్లోనే అంటే సుమారు 550 గంటల్లో వెండి ధర ఏకంగా ఒక లక్ష రూపాయలు పెరగడం ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఒక అరుదైన, ఎవరూ ఊహించని రికార్డు. ఈ పెరుగుదల వేగాన్ని చూసి ఇన్వెస్టర్లు, సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ధర గరిష్టంగా రూ.3,39,927 వద్ద ఆల్‌టైమ్ రికార్డును తాకింది. ఒక్క రోజులోనే దాదాపు రూ.12,638 పెరగడం ట్రేడర్లను ఆశ్చర్యపరిచింది. గురువారం నాడు కాస్త తగ్గినట్లు కనిపించిన ధర, శుక్రవారం నాటికి మళ్ళీ పుంజుకుని రాకెట్ లా దూసుకెళ్లింది.
అత్యంత విస్తుపోయే విషయం ఏమిటంటే.. గడిచిన 23 రోజుల్లో (సుమారు 550 గంటల్లో) వెండి ధర కిలోకు లక్ష రూపాయలకు పైగా పెరిగింది. డిసెంబర్ చివరి నాటికి రూ.2,35,701 వద్ద ఉన్న ధర, ఇప్పుడు రూ.3.40 లక్షలకు చేరువలో ఉంది. అంటే ఈ జనవరి నెలలో సగటున రోజుకు రూ.4,531 చొప్పున ధర పెరిగింది. ఇలాంటి విపరీతమైన పెరుగుదల వెండి చరిత్రలో ఎన్నడూ సంభవించలేదు. ఇన్వెస్టర్లు వెండిపై విపరీతంగా పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామికంగా డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో వెండి ధర రూ.9,500 పెరిగి రూ.3,29,500 వద్ద ముగిసింది. స్థానిక మార్కెట్లో బుధవారం నాడు కిలో వెండి రూ.3.34 లక్షల వద్ద రికార్డు సృష్టించగా, మళ్ళీ అదే దిశగా పయనిస్తోంది. కేవలం ఢిల్లీ మార్కెట్లోనే ఈ నెలలో దాదాపు రూ.90,500 ధర పెరగడం విశేషం. వివాహాది శుభకార్యాల సమయం కావడంతో సామాన్యులు వెండి వస్తువులు కొనాలంటేనే జంకుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి సెగలు రేపుతోంది. న్యూయార్క్‌లోని కామెక్స్ మార్కెట్లో వెండి ధర చరిత్రలో మొదటిసారి 100 డాలర్లు మార్కును దాటింది. శుక్రవారం నాడు 5 శాతం పెరిగి 101.33 డాలర్లకు చేరుకుంది. సిల్వర్ స్పాట్ ధర అయితే ఏకంగా 103 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. యూరోపియన్, బ్రిటిష్ మార్కెట్లలో కూడా వెండి ధరలు 6 శాతం పైగా పెరిగాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.