Skoda Kushaq : క్రెటా, సెల్టోస్‌లకు చుక్కలు చూపిస్తున్న స్కోడా కుషాక్..నాలుగేళ్ల ప్రస్థానంలో సరికొత్త రికార్డు.

Update: 2026-01-22 07:15 GMT

Skoda Kushaq : స్కోడా ఆటో ఇండియాకు 2025 సంవత్సరం ఒక మైలురాయిలా నిలిచిపోయింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు ఈ ఏడాది నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణం 2021 జూన్‌లో లాంచ్ అయిన కుషాక్. భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇండియా 2.0 ప్రోగ్రామ్ కింద వచ్చిన మొదటి కారు ఇది. జర్మన్ టెక్నాలజీతో, ఇండియన్ రోడ్లకు తగ్గట్టుగా MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ మీద దీనిని నిర్మించారు. ఇప్పుడు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత, మరింత స్టైలిష్ లుక్, మోడ్రన్ ఫీచర్లతో కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను స్కోడా విడుదల చేసింది.

సియామ్ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 2025 నాటికి కుషాక్ ఏకంగా 94,927 యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకుంది. ఇది కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశాలకు కూడా 4,600 పైగా యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కుషాక్ రాకతో స్కోడా అమ్మకాల్లో భారీ మార్పు వచ్చింది. అంతకుముందు స్కోడా దగ్గర ఉన్న కోడియాక్ వంటి కార్లు తక్కువ సంఖ్యలో అమ్ముడవుతుంటే, కుషాక్ వచ్చిన మొదటి ఏడాదిలోనే (2022) 21,427 యూనిట్లు అమ్ముడై స్కోడా మొత్తం సేల్స్‌లో 98 శాతం వాటాను ఆక్రమించింది.

2023 ఆర్థిక సంవత్సరం కుషాక్ చరిత్రలో అత్యుత్తమ సంవత్సరంగా నిలిచింది. ఆ ఏడాది ఏకంగా 25,300 యూనిట్లు అమ్ముడై, 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మాత్రమే కాకుండా మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి కొత్త కార్లు కూడా రంగంలోకి దిగాయి. దీంతో కుషాక్ సేల్స్‌లో గతేడాది స్వల్ప తగ్గుదల (7.53%) కనిపించింది. ఈ పోటీని తట్టుకుని మళ్ళీ నంబర్ 1 స్థానానికి చేరుకోవడానికే స్కోడా ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది.

కుషాక్ విజయవంతం కావడంతో, స్కోడా అదే ప్లాట్‌ఫారమ్ మీద కైలాక్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా తెచ్చింది. ఇది కూడా మార్కెట్లో మంచి ఫలితాలను ఇస్తోంది. అయితే, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కుషాక్ ఇచ్చే క్వాలిటీ, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ముఖ్యంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దీనిని కస్టమర్ల ఫేవరెట్‌గా మార్చేశాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రావడంతో ఇకపై క్రెటా, సెల్టోస్‌ల వేట మరింత ముమ్మరం కానుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News