Skoda Slavia : స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..హోండా సిటీ, వెర్నాకు గట్టి పోటీ తప్పదా?

Update: 2026-01-24 16:45 GMT

Skoda Slavia : జర్మన్ కార్ల తయారీ సంస్థ స్కోడా, భారత మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించిన కంపెనీ, ఇప్పుడు తన పాపులర్ సెడాన్ స్కోడా స్లావియాకు కొత్త హంగులు అద్ది మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ అప్‌డేటెడ్ సెడాన్ 2026 నాటికి భారత రోడ్లపై పరుగులు తీయనుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో వివరంగా చూద్దాం.

భారతదేశంలో సెడాన్ కార్లకు ఉన్న క్రేజ్ తగ్గలేదు సరికదా, సరికొత్త మోడళ్లతో మళ్ళీ ఊపందుకుంటోంది. స్కోడా ఆటో ఇండియా తన స్లావియా సెడాన్‌ను మరింత ఆధునీకరించి 2026 మొదటి సగభాగంలో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న స్లావియా మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ పోటీని తట్టుకుని నిలబడటానికి, స్కోడా తన కారుకు అదిరిపోయే మేక్ ఓవర్ ఇస్తోంది.

కొత్త డిజైన్ ఎలా ఉండబోతోంది?

టెస్టింగ్ సమయంలో చిక్కిన ఫోటోల ప్రకారం..స్లావియా ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త వెర్టికల్ స్లాటెడ్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ దీనికి కొత్త లుక్ ఇవ్వనున్నాయి. బంపర్ డిజైన్ కూడా మరింత అగ్రెసివ్‌గా మార్చారు. వెనుక భాగంలో కొత్త ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, కొత్త అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను తీసుకురానున్నాయి.

ఇంటీరియర్, అదిరిపోయే ఫీచర్లు

కారు లోపలి భాగం ఇప్పుడు మరింత లగ్జరీగా మారనుంది. కుషాక్ ఫేస్‌లిఫ్ట్ తరహాలోనే ఇందులో కూడా కొన్ని కీలక మార్పులు ఉండవచ్చు. సెడాన్ లవర్స్ ఎప్పటినుండో కోరుకుంటున్న పనోరమిక్ సన్ రూఫ్ ఈసారి వచ్చే అవకాశం ఉంది. హై-ఎండ్ వేరియంట్లలో వెనుక సీట్ల కోసం మసాజ్ ఫంక్షన్ ఫీచర్‌ను జోడించే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్‌ను ఈసారి స్లావియాలో మనం చూడవచ్చు.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్

ఫేస్‌లిఫ్ట్ మోడల్ కాబట్టి, ఇంజిన్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ (115 hp), 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ (150 hp) ఇంజిన్లను అలాగే కొనసాగించనున్నారు. అయితే, కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను 1.0 లీటర్ ఇంజిన్‌కు జోడించే అవకాశం ఉంది, ఇది డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తుంది.

ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుత స్లావియా ధరలు రూ.10.69 లక్షల నుంచి రూ.18.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఫీచర్లు పెరుగుతున్నాయి కాబట్టి, ధర కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. మొత్తానికి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ తన లగ్జరీ లుక్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో మళ్ళీ భారత సెడాన్ మార్కెట్ ని శాసించడానికి సిద్ధమవుతోంది.

Tags:    

Similar News