Skoda : స్కోడా కస్టమర్లకు పండగే పండగ..రోడ్డు మీద కారు ఆగినా డోంట్ వర్రీ.
Skoda : స్కోడా కారు యజమానులకు ఇకపై ప్రయాణం మరింత నిశ్చింతగా సాగనుంది. తమ బ్రాండ్‌పై కస్టమర్లకు నమ్మకాన్ని పెంచేందుకు స్కోడా ఇండియా 2026 నుంచి అన్ని కొత్త కార్లపై ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది. కారు కొన్న మొదటి రోజు నుండే కంపెనీ బాధ్యత తీసుకునేలా ఈ సూపర్ కేర్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశారు. దీని కింద కస్టమర్లకు 4 ఏళ్ల పాటు అపరిమితమైన రక్షణ లభిస్తుంది. సర్వీసింగ్ బిల్లులు ఎలా వస్తాయో అన్న భయం లేకుండా పారదర్శకమైన సేవలను అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కొత్త పథకం కింద స్కోడా ప్రధానంగా మూడు రకాల ప్రయోజనాలను అందిస్తోంది. మొదటిది 4 ఏళ్ల స్టాండర్డ్ వారంటీ. కారులో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే నాలుగు సంవత్సరాల పాటు కంపెనీయే ఉచితంగా బాగు చేస్తుంది. రెండోది 4 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్. మీరు ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్లినప్పుడు దారి మధ్యలో కారు చెడిపోతే, ఒక్క ఫోన్ కాల్‌తో స్కోడా టీమ్ మీ దగ్గరకు వచ్చి సాయం చేస్తుంది. ఇక మూడోది, 4 ఉచిత సర్వీసులు. ఇందులో 1,000 కిలోమీటర్లు, 7,500 కిలోమీటర్ల వద్ద చేసే చెకప్ సర్వీసులతో పాటు.. 15,000, 30,000 కిలోమీటర్ల మేజర్ సర్వీసులపై లేబర్ ఛార్జీలు ఉండవు.
స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. కస్టమర్లకు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం మెకానికల్ సేవలే కాకుండా, డిజిటల్ అసిస్టెన్స్ కూడా ఈ ప్యాకేజీలో భాగం. స్కోడా యాప్ ద్వారా కస్టమర్లు తమ కారు సర్వీసింగ్ స్టేటస్‌ను రియల్ టైమ్‌లో చూడవచ్చు. సర్వీసింగ్‌కు ఎంత ఖర్చు అవుతుంది? ఏయే పార్టులు మారుస్తున్నారు? వంటి వివరాలన్నీ డిజిటల్ బిల్లింగ్ ద్వారా పారదర్శకగా తెలుస్తాయి. దీనివల్ల సర్వీస్ సెంటర్ల వద్ద మోసాలకు తావుండదు.
కస్టమర్లకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్కోడా తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలోని 183 నగరాల్లో 325 కంటే ఎక్కువ సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నా సరే, స్కోడా నెట్‌వర్క్ మీకు అందుబాటులో ఉంటుంది. కారు అమ్మడమే కాదు, కస్టమర్‌తో సుదీర్ఘ కాలం బంధాన్ని కొనసాగించడమే స్కోడా అసలు వ్యూహం. ఈ సరికొత్త సర్వీస్ ప్యాకేజీతో ఫోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ వంటి కంపెనీలకు స్కోడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.