Maruti Suzuki : చిన్న కార్లతో చరిత్ర సృష్టించిన మారుతి.. ఇప్పుడు జీఎస్‌టీ 2.0 తో మళ్లీ రికార్డులు బ్రేక్.

Update: 2025-10-17 12:00 GMT

Maruti Suzuki : 2000ల ప్రారంభంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతున్నప్పుడు మారుతి సుజుకి దేశ జీవనశైలిని సైలెంటుగా మార్చేసింది. ఖరీదైన సెడాన్‌లతోనో లేదా విదేశీ కార్లతోనో కాదు, చిన్న, చవకైన, ఇంధనాన్ని ఆదా చేసే హ్యాచ్‌బ్యాక్ కార్లతో ఈ మార్పును తీసుకొచ్చింది. మారుతి 800 ఆ తర్వాత ఆల్టో వంటి కార్లు లక్షలాది భారతీయులకు సొంత కారు కలిగి ఉండాలనే కలను నిజం చేశాయి.

మారుతి కేవలం కార్లను మాత్రమే విక్రయించలేదు. అది ప్రజల్లో నమ్మకాన్ని, అనుబంధాన్ని సృష్టించింది. చిన్న పట్టణాల్లో, మధ్యతరగతి కుటుంబాలకు మారుతి కారు కొనడం అనేది కేవలం ఒక అవసరం కాదు, అభివృద్ధికి సంకేతంగా మారింది. ఈ భావోద్వేగ అనుబంధం మారుతి బ్రాండ్‌కు ప్రకటనలతో కొనలేని ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.

గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా నడిచింది. నెక్సాన్, థార్ వంటి వాహనాలు కేవలం ఫీచర్ల కోసం కాకుండా, ఒక స్టేటస్ సింబల్‌గా చూసేవారు. దీని ఫలితంగా చిన్న కార్ల అమ్మకాలు తగ్గాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. చిన్న కార్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీనికి కేంద్రంగా మారుతి సుజుకి ఇండియా ఉంది.

మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. చిన్న కార్ల బుకింగ్‌లలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోందని, దీని ద్వారా కొత్త కస్టమర్‌లు మార్కెట్‌లోకి వస్తున్నారని తెలిపారు. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ మంది టూ వీలర్ల నుంచి ఫోర్ వీలర్లకు అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇటీవల జీఎస్‌టీ రేట్లను తగ్గించడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను 28% నుండి 18%కి తగ్గించబడింది. దీనివల్ల చిన్న కార్ల ధరలు 2% నుండి 21% వరకు తగ్గాయి. ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో వంటి కార్ల ధరలు 13-22% వరకు తగ్గాయి.

మారుతి నివేదిక ప్రకారం.. జీఎస్‌టీ తగ్గింపు తర్వాత కేవలం నాలుగు వారాల్లోనే కంపెనీకి 4 లక్షల బుకింగ్‌లు వచ్చాయి. ఇందులో 80,000 ఆర్డర్‌లు చిన్న కార్లవే. ఇది జీఎస్‌టీ అమలుకు ముందు ఉన్న దానికంటే 70% ఎక్కువ అని మారుతి తెలిపింది. మారుతి కంపెనీ బైక్ నడిపే కస్టమర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. వారు ఇప్పుడు తమ మొదటి కారు కొనాలని చూస్తున్నారు.

నవరాత్రి, దీపావళి పండుగల సందర్భంగా మారుతి రూ.1,999 ఈఎమ్‌ఐ ఆఫర్‌ను ప్రారంభించింది. దీనివల్ల గ్రామీణ, చిన్న పట్టణాల నుండి కొనుగోలుదారులు భారీగా పెరిగారు. ఒక్క అక్టోబర్ నెలలోనే ఆల్టో బుకింగ్‌లు 60% వరకు పెరిగాయి. కంపెనీ ఇప్పుడు నిరంతరం ఉత్పత్తిని పెంచుతోంది. ఆదివారాలు కూడా ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌యూవీల అమ్మకాలు 2.35 మిలియన్ యూనిట్లకు చేరుకోగా, చిన్న కార్ల అమ్మకాలు సుమారు 10 లక్షల యూనిట్లకు తగ్గాయి. కానీ జీఎస్‌టీ తగ్గింపు, ఆఫర్ల తర్వాత చిన్న కార్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఆల్టో K10, వాగన్‌ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లపై రూ.47,000 నుండి రూ.57,000 వరకు డిస్కౌంట్లను కూడా మారుతి అందిస్తోంది.

Tags:    

Similar News