Cigarette Prices Hike : పొగ తాగేవారిపై పన్నుల బాదుడు.. ఏకంగా రూ.55 పెరిగిన ప్రీమియం సిగరెట్లు.
Cigarette Prices Hike : పొగతాగే అలవాటు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచడంతో, మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నిర్ణయం వల్ల ఒక్కో సిగరెట్ ప్యాకెట్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.22 నుంచి రూ.55 వరకు ధర పెరిగింది. ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. గడిచిన ఏడు సంవత్సరాలలో సిగరెట్లపై ఇంత భారీ స్థాయిలో పన్నులు పెంచడం ఇదే మొదటిసారి. గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన కొత్త పన్ను విధానం ఇప్పుడు అమలులోకి వచ్చింది. 2017లో జీఎస్‌టీ వచ్చినప్పటి నుంచి అమల్లో ఉన్న జీఎస్‌టీ కాంపెన్సేషన్ సెస్ స్థానంలో కొత్త ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల సాధారణ బ్రాండ్ల 10 సిగరెట్ల ప్యాకెట్‌పై రూ.22 నుంచి రూ.25 వరకు పెరగగా, ఖరీదైన ప్రీమియం బ్రాండ్లపై దాదాపు రూ.55 వరకు భారం పడింది. కంపెనీలు ఇంకా కొత్త ఎంఆర్‌పీ ధరలతో ప్యాకెట్లను ముద్రించనప్పటికీ, హోల్ సేల్ వ్యాపారులు ఇప్పటికే 40 శాతం జీఎస్‌టీతో రిటైలర్లకు బిల్లులు వేయడం మొదలుపెట్టారు.
మధ్యతరగతి జనం ఎక్కువగా తాగే విల్స్ నేవీ కట్ 10 సిగరెట్ల ప్యాకెట్ ధర రూ.95 నుంచి రూ.120కి చేరింది. ఇక ఖరీదైన 84mm బ్రాండ్లైన గోల్డ్ ఫ్లేక్ లైట్స్, విల్స్ క్లాసిక్ వంటి వాటి ధరలు రూ.170 నుంచి రూ.225 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే స్లిమ్ సిగరెట్ కేటగిరీలో ఉన్న క్లాసిక్ కనెక్ట్ 20 సిగరెట్ల ప్యాకెట్ ధర రూ.300 నుంచి ఏకంగా రూ.350కి చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ నెలాఖరుకల్లా కొత్త ధరలతో ఉన్న ప్యాకెట్లు మార్కెట్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి.
ధరలు విపరీతంగా పెరగడంతో అక్రమ మార్కెట్ పెరుగుతుందని డీలర్లు భయపడుతున్నారు. సిగరెట్లు ఖరీదైనవిగా మారితే ప్రజలు చౌకగా దొరికే ఇతర ప్రమాదకరమైన ఉత్పత్తుల వైపు లేదా విదేశాల నుంచి అక్రమంగా వచ్చే సిగరెట్ల వైపు మళ్లే అవకాశం ఉందని ఆల్ ఇండియా సిగరెట్ అండ్ టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9,000 మంది స్టాకిస్టులు ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని, చిన్న వ్యాపారుల ఆదాయంపై గట్టి దెబ్బ పడుతుందని వారు వాదిస్తున్నారు.
ధరల పెంపు వెనుక ప్రభుత్వానికి స్పష్టమైన లక్ష్యం ఉంది. పొగాకు వాడకాన్ని తగ్గించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది. పొగాకు వల్ల వచ్చే వ్యాధుల చికిత్స కోసం దేశంలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ధరలు పెంచడం ద్వారా యువతను, సామాన్యులను ధూమపానానికి దూరంగా ఉంచవచ్చని అంతర్జాతీయ ప్రజారోగ్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, పన్నులు చెల్లించే వ్యాపారుల కంటే స్మగ్లర్లకు ఇది వరంగా మారకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.