Software employ success Story: ఐటీ ఉద్యోగం వదిలి దానిమ్మ సాగు చేస్తూ.. లక్షల్లో సంపాదన

Software employ success Story: ఎక్కడో ఊరికి దూరంగా నగరంలో ఉంటూ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వేలల్లో సంపాదించినా ఎందుకో తెలియని నిరాసక్తత. ఉద్యోగం మానేయాలన్న ఆలోచన.. ఇంట్లో వాళ్లకి, బంధువులకి చెప్తే ఎందుకు పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు.. హాయిగా ఉద్యోగం చేసుకోక అన్నారు.

Update: 2023-04-10 07:18 GMT

Software employ success story: ఎక్కడో ఊరికి దూరంగా ఉంటూ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వేలల్లో సంపాదించినా ఎందుకో తెలియని నిరాసక్తత. ఉద్యోగం మానేయాలన్న ఆలోచన.. ఇంట్లో వాళ్లకి, బంధువులకి చెప్తే ఎందుకు పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు.. హాయిగా ఉద్యోగం చేసుకోక అన్నారు. కానీ అతడి మనసు అందుకు సహకరించలేదు.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు.. దానికి తోడు తండ్రి కూడా కరోనా వచ్చి మరణించాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న 32 ఏళ్ల భువనేశ్వర్ కంపెనీకి రిజైన్ లెటర్ ఇచ్చి అనంతపురం బస్ ఎక్కాడు. తాత ముత్తాల నుంచి వచ్చిన 16 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు.

ధైర్యవంతులకు అదృష్టం కూడా తోడవుతుందనే నానుడి భువనేశ్వర్ విషయంలో నిజమైంది. బెంగుళూరులో టెక్కీగా కేవలం ఐదు అంకెల జీతం తీసుకునే అతడు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. అనంతపురంలోని బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన భువనేశ్వర్‌ సంప్రదాయ వ్యవసాయం చేయడం కష్టమైన పనిగా భావించాడు. భారీ నష్టాలను చవిచూసిన అతడికి వ్యవసాయాన్ని లాభదాయకమైన వెంచర్‌గా మార్చడానికి ప్రత్యామ్నాయ పంటలను అన్వేషించడం మొదలు పెట్టాడు. నల్ల నేలకు సరిపోయే ఒక ఆదర్శ పంట కోసం ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించాడు. అప్పుడే అతడికి దానిమ్మపంట గురించి తెలిసింది. మహారాష్ట్ర నుండి మొక్కలు తెచ్చి 2020లో ఆరు ఎకరాల భూమిలో నాటాడు. తర్వాత దశలవారీగా తనకున్న 16 ఎకరాల్లో మొత్తం దానిమ్మ పంటనే పండించాడు.

11 నెలల వ్యవధిలో, 26 టన్నుల దిగుబడి సాధించి టన్నుకు రూ.60,000-రూ.70,000 వరకు దానిమ్మలను విక్రయించడం ద్వారా రూ.18 లక్షలు సాధించాడు. రూ. 4 లక్షలు ఖర్చులు పోగా మొదటి సైకిల్ ఉత్పత్తుల విక్రయం ద్వారా రూ. 14 లక్షల లాభం పొందాడు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని బెంగళూరులోని వివిధ గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్న వారికి కిలో రూ. 100 చొప్పున తన ఉత్పత్తులను విక్రయించాడు. అతను మొబైల్ యాప్ ద్వారా దాదాపు 16 టన్నుల పండ్లను విక్రయించాడు, తద్వారా మధ్యవర్తుల జోక్యాన్ని తొలగించి, తన లాభాన్ని రూ. 16 లక్షలకు పెంచుకున్నాడు. ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా బెంగళూరులోని వినియోగదారులకు పండ్లను డెలివరీ చేశాడు. అతను తన పొలంలో రోజువారీ పనుల కోసం దాదాపు 10 మంది కూలీలను కూడా నియమించుకున్నాడు.

అతను తన పొలంలో బిందు సేద్యానికి అవసరమైన సౌర శక్తిని ఉత్పత్తి చేసే సౌర ఫలకాలను అమర్చాడు. అతను పంటను దెబ్బతీయకుండా కీటకాల నివారణకు సోలార్ లైట్లను ఏర్పాటు చేశాడు. వర్షపాతం, నేలలో తేమ, తెగుళ్ల గురించి తెలుసుకోవడానికి శాటిలైట్ కనెక్షన్‌తో 13 సెన్సార్లతో రూ. 50,000 ఖరీదు చేసే స్వదేశీ FASAL పరికరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. దానిమ్మ సాగు ద్వారా లాభాలు ఆర్జించేలా రైతులకు బోధించడానికి, శిక్షణ ఇవ్వడానికి అతను యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ప్రారంభించాడు. దళారులను తొలగించి రైతులకు మేలు చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కంపెనీలు రైతుల నుండి ఉత్పత్తులను సేకరించడానికి మధ్యవర్తులను ఉపయోగించుకుంటాయి. దీనివలన రైతుకు ప్రయోజనం చేకూరడం లేదని భువనేశ్వర్ తెలిపారు.

Tags:    

Similar News