SIP : ఎస్‌ఐపీ ఆపుతున్నారా? జాగ్రత్త.. మీరు చేసే ఆ చిన్న పొరపాటుకు కోటిన్నర నష్టం.
SIP : మ్యూచువల్ ఫండ్లలో ఎస్‌ఐపీని మధ్యలో నిలిపివేయడం అనేది ఆర్థికంగా ఆత్మహత్య సదృశ్యమే అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఒక నెల రూ.20,000 పెట్టుబడిని ఆపినప్పుడు, కేవలం ఆ ఇరవై వేలను మాత్రమే కోల్పోవడం లేదు.. ఆ డబ్బుపై వచ్చే 20 లేదా 30 ఏళ్ల కాంపౌండింగ్ లాభాన్ని కూడా శాశ్వతంగా వదులుకుంటున్నాము. కాంపౌండింగ్‌కు మీ వ్యక్తిగత ఇబ్బందులతో సంబంధం ఉండదు. దానికి కావాల్సింది కేవలం నిరంతరాయమైన సమయం మాత్రమే. చాలామంది తమకు డబ్బు అవసరమైనప్పుడు ముందుగా ఎస్‌ఐపీలనే టార్గెట్ చేస్తారు, కానీ అదే అతిపెద్ద పొరపాటు.
ఉదాహరణకు, మీరు నెలకు రూ.20,000 చొప్పున 30 ఏళ్ల పాటు ఎస్‌ఐపీ చేస్తున్నారని అనుకుందాం. సగటున 12% వార్షిక రిటర్న్ వస్తే, 30 ఏళ్ల తర్వాత మీ దగ్గర సుమారు రూ.7 కోట్ల భారీ ఫండ్ ఉంటుంది. అయితే, ప్రతి ఏటా పండగకో, పెళ్లికో కేవలం మూడు నెలల పాటు ఎస్‌ఐపీని నిలిపివేశారనుకోండి.. ఆ చిన్న గ్యాప్ వల్ల మీ ఫైనల్ ఫండ్ రూ.5.5 కోట్లకు పడిపోతుంది. అంటే, మీరు పొదుపు చేసిన స్వల్ప మొత్తం కోసం భవిష్యత్తులో ఏకంగా రూ.1.5 కోట్లను నష్టపోతున్నారు. మీరు ఆపిన డబ్బు కేవలం లక్షల్లోనే ఉండొచ్చు, కానీ అది చేకూర్చాల్సిన లాభం మాత్రం కోట్లలో ఉంటుంది.
పెట్టుబడిలో పోయిన డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ, పోయిన సమయాన్ని తీసుకురాలేము. చాలామంది "ఈసారి ఆపేద్దాం, వచ్చే ఏడాది నుంచి డబుల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం" అని సరిపెట్టుకుంటారు. కానీ ఆ ఒక్క ఏడాదిలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. ఎస్‌ఐపీ అనేది ఒక క్రమశిక్షణ. ప్రతి నెల జరిగే ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని మీకు సగటు లాభాన్ని అందిస్తుంది. మధ్యలో ఆపడం వల్ల ఆ రుపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాన్ని కూడా మీరు కోల్పోతారు.
మీ జీవితంలో పెళ్లిళ్లు, పండుగలు లేదా అత్యవసర ఖర్చులు రావడం సహజం. వాటి కోసం ఎస్‌ఐపీని పూర్తిగా ఆపేయకండి. వీలైతే కొన్ని నెలల పాటు పెట్టుబడి మొత్తాన్ని తగ్గించుకోండి, కానీ ఖాతాను మూసివేయకండి. ముందే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులకు ఆటంకం కలగదు. ఎస్‌ఐపీని ఎప్పుడూ ఆటో-డెబిట్ మోడ్‌లో ఉంచండి, తద్వారా ఖర్చులు పెరిగినా మీ పొదుపు మాత్రం ఆగదు.