Sunflower Oil : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. సన్‌ఫ్లవర్‌ రూ.250 అయ్యే ఛాన్స్ ?

Sunflower Oil : తెలుగు రాష్ట్రాల్లో వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. పదిహేను రోజులుగా ఆయిల్ ప్యాకెట్ల ధరలు భగభగమండుతున్నాయి.

Update: 2022-03-14 08:30 GMT

Sunflower Oil : తెలుగు రాష్ట్రాల్లో వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. పదిహేను రోజులుగా ఆయిల్ ప్యాకెట్ల ధరలు భగభగమండుతున్నాయి. చుక్కలంటుతున్న వంటనూనెల ధరలతో సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. బ్రాండెడ్ ప్యాకెట్ల ధరలు సైతం ఆకాశనంటాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం బూచి చూపిస్తూ...రిటైల్‌ మార్కెట్‌లో ఆయిల్‌ ధరలను లీటరుకు అమాంతం 20 నుంచి 40 రూపాయలకు పెంచేసి విక్రయిస్తున్నారు. ఇదే టైమ్‌లో కొందరు ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్‌లో మరింత గోల్‌మాల్‌కి పాల్పడుతున్నారు.

వాస్తవంగా మార్కెట్‌లో లీటరు నూనె ప్యాకెట్‌ ధర 172 రూపాయలుంటే..మార్కెట్లో మాత్రం 185 తక్కువకు అమ్మటం లేదు. 15 రోజుల కిందట పల్లీ నూనె లీటర్‌ రిటైల్‌ ధర 134 రూపాయలు ఉండగా...లోకల్‌ షాప్‌ల్లో మాత్రం 185 నుంచి 190కు విక్రయిస్తున్నారు. అటు పామాయిల్‌ రేటు సైతం 162లకు దాటింది. గతంలో వంటనూనె ప్యాకెట్లను ఆఫర్‌లతో MRP కన్న తక్కువ ధరకే విక్రయించే వ్యాపారులు.. భారీగా దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీలు సైతం ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ పరిస్థితులకు తగ్గట్టు 8 శాతం వరకూ రేట్లు పెంచాయన్న ఆరోపణలున్నాయి.

అటు అమాంతం పెరిగిన వంటనూనెల ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. గతంలో నెలకు మూడు నుంచి నాలుగు నూనె ప్యాకెట్లను కొనుగోచేస్తే.. ప్రస్తుతం రెండింటితోనే సరి పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకుంటోందని సామాన్యులు వాపోతున్నారు. అటు దీపారాధన కోసం వినియోగించే నూనె రెట్లూ సైతం చుక్కలనంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు చుక్కలంటున్న వంటనూనె రేట్లతో హోటల్‌ నిర్వాహకులు విలవిల్లాడుతున్నారు. రెండు నెలల క్రితం కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్ల రేట్లు పెరగడంతో ఇబ్బంది పడ్డామని... తాజాగా నూనె రేట్లతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు.

రోజురోజుకు బెంబేలెత్తిస్తున్న వంటనూనె ధరలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలతో నూనె ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎక్కడో జరిగే యుద్ధం పేరు చెప్పి అడ్డగోలుగా ధరలు పెంచితే మధ్యతరగతి వాళ్లు ఎలా భరించగలరని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News