Business Secrets : వడ్డించేవాడు మనవాడైనా..లాభం మాత్రం జొమాటోదే..క్లిక్కుల్లో దాగిన కమిషన్ గుట్టు ఇదే

Update: 2025-12-26 08:15 GMT

Business Secrets : నేడు నగరాల్లో నివసించే వారి జీవితాల్లో స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లు నిత్యావసరాలుగా మారిపోయాయి. ఆకలి వేస్తే చాలు మొబైల్‌లో ఒక్క క్లిక్‌తో ఆహారం ఇంటి ముందు ప్రత్యక్షమవుతోంది. అయితే, మనం కట్టే బిల్లులో సింహభాగం ఎవరి జేబులోకి వెళ్తోంది? ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు హోటళ్ల నుంచి ఎంత వసూలు చేస్తున్నాయి? ఎండనక, వాననక కష్టపడే డెలివరీ బాయ్స్‌కు అందులో ఎంత దక్కుతోంది? ఈ లెక్కలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

హోటళ్లపై కమిషన్ల భారం..

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు కేవలం డెలివరీ సర్వీస్ మాత్రమే కాదు, హోటళ్ల నుంచి భారీగా కమిషన్లు వసూలు చేస్తాయి. సాధారణంగా ప్రతి ఆర్డర్ విలువలో 15% నుంచి 25% వరకు కమిషన్‌ను ఈ యాప్‌లు తీసుకుంటాయి. ఉదాహరణకు ఒక రెస్టారెంట్ స్విగ్గీ ద్వారా నెలకు ఒక లక్ష రూపాయల వ్యాపారం చేస్తే, అందులో సుమారు రూ.20,000 నుంచి రూ.25,000 వరకు నేరుగా స్విగ్గీ జేబులోకి వెళ్తుంది. ఇది కాకుండా ప్లాట్‌ఫారమ్ ఫీజు, ప్రమోషన్ల కోసం అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఈ భారంతో హోటల్ యజమానులు చేసేదేమీ లేక యాప్‌లో రేట్లు పెంచేస్తున్నారు. అందుకే హోటల్‌కు వెళ్లి తింటే తక్కువ ధరకే వచ్చే ఆహారం, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ప్రియమవుతోంది.

కస్టమర్లపై డెలివరీ వాత

మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు డెలివరీ ఫీజు అని అదనంగా చెల్లిస్తాం కదా? ఆ డబ్బు మొత్తం నేరుగా డెలివరీ బాయ్ చేతికి వెళ్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. యాప్‌లు వసూలు చేసే డెలివరీ ఛార్జీల్లో చాలా తక్కువ భాగం మాత్రమే డెలివరీ పార్ట్‌నర్లకు దక్కుతుంది. మిగిలిన మొత్తాన్ని కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులు, మార్కెటింగ్ కోసం వాడుకుంటాయి. ఒక కస్టమర్ రూ.50 డెలివరీ ఛార్జ్ కట్టినా, అందులో డెలివరీ బాయ్ కు వచ్చేది చాలా స్వల్పం.

డెలివరీ వర్కర్ల దుస్థితి

ఒక ఆర్డర్ డెలివరీ చేసినందుకు డెలివరీ వర్కర్లకు కేవలం రూ.20 నుండి రూ.40 వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. ఇది ప్రయాణించిన దూరం, తీసుకున్న సమయం, ఆర్డర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. వర్షం కురిసినప్పుడు లేదా రాత్రి సమయాల్లో పని చేస్తే కొన్ని ఇన్సెంటివ్‌లు లభిస్తాయి. అయితే, బైక్ పెట్రోల్ ఖర్చు, మొబైల్ రీఛార్జ్, బైక్ మెయింటెనెన్స్ అన్నీ ఆ వర్కరే భరించాలి. ఇవన్నీ తీసేస్తే ఒక ఆర్డర్‌పై మిగిలేది చాలా తక్కువ. ప్లాట్‌ఫారమ్ కంపెనీలు కోట్లు గడిస్తున్నా, అట్టడుగున కష్టపడే ఈ గిగ్ వర్కర్ల వేతనాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా డెలివరీ వర్కర్లు తమ జీతాల కోసం సమ్మె బాట పడుతున్నారు.

Tags:    

Similar News