Tata Intra EV : సిటీ రోడ్లపై సైలెంట్ కిల్లర్.. సౌండ్ ఉండదు కానీ, ఎంత పనైనా పక్కాగా జరుగుతుంది.
Tata Intra EV : భారతదేశ వాణిజ్య వాహన రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లలో దూసుకుపోతున్న టాటా, ఇప్పుడు సరుకు రవాణా చేసే వ్యాపారుల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ పిక్-అప్ ట్రక్ టాటా ఇంట్రా ఈవీని మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.11.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ వాహనం, లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. టాటా ఇంట్రా ఈవీని ప్రత్యేకంగా నగరాల లోపల, లాస్ట్ మైల్ డెలివరీ (చివరి గమ్యస్థానానికి చేరవేయడం) కోసం రూపొందించారు. ఈ వాహనం గరిష్టంగా 1,750 కిలోల బరువును మోయగలదు. అంటే ఇటు ఈ-కామర్స్ కంపెనీలకు, అటు ఎఫ్ఎమ్‌సీజీ పంపిణీదారులకు ఇది ఒక వరప్రసాదం. దీని బాడీ పొడవు 10 అడుగుల కంటే ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద వస్తువులను కూడా సులభంగా తరలించవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ పిక్-అప్ ట్రక్ లో 28.2 kWh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 211 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని టాటా మోటార్స్ హామీ ఇస్తోంది. ఇందులో ఉన్న 72 kW ఎలక్ట్రిక్ మోటార్, 230 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే కొండ ప్రాంతాల్లో లేదా ఎత్తుగా ఉండే వంతెనల మీద కూడా 23 శాతం గ్రేడబిలిటీతో ఇది అప్రతిహతంగా దూసుకుపోగలదు. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం దీని బ్యాటరీకి IP67 రేటింగ్ కూడా ఇచ్చారు.
వ్యాపారస్తుల సమయాన్ని ఆదా చేసేందుకు టాటా ఇందులో CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించింది. దీనివల్ల కేవలం 55 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఇక వారంటీ విషయానికొస్తే.. బ్యాటరీపై ఏకంగా 6 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు భరోసా ఇస్తోంది. దీనివల్ల కస్టమర్లకు నిర్వహణ ఖర్చుల భయం ఉండదు. ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, మూడు రకాల రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లు దీని మైలేజీని మరింత పెంచుతాయి.
డ్రైవర్ సౌకర్యం కోసం కేబిన్ లోపల వాక్-త్రూ లేఅవుట్, ఎలక్ట్రిక్ పవర్-అసిస్టెడ్ స్టీరింగ్ ఇచ్చారు. దీనివల్ల రద్దీగా ఉండే సిటీ రోడ్లపై కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. టాటా మోటార్స్ కి దేశవ్యాప్తంగా ఉన్న 25,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు, 200 పైగా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ ఈ వాహనదారులకు అదనపు బలాన్ని ఇస్తుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఏస్ ఈవీ (Ace EV)తో పాటు ఇప్పుడు ఈ ఇంట్రా ఈవీ కూడా చేరడం వల్ల టాటా ఈవీ పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం అయింది.