Tata Motors : టాటా ఈవీ ప్రభంజనం..2.5 లక్షల మైలురాయి దాటిన విక్రయాలు.

Update: 2025-12-24 10:45 GMT

Tata Motors : భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 డిసెంబర్ నాటికి దేశీయ మార్కెట్లో ఏకంగా 2.5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన తొలి కంపెనీగా టాటా రికార్డు నెలకొల్పింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఈ భారీ మైలురాయిని అందుకోవడం విశేషం. 2020లో టాటా మోటార్స్ తన మొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీను లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఈ కారు వెనక్కి తిరిగి చూడలేదు. తాజాగా ఈ మోడల్ ఒక్కటే లక్ష యూనిట్ల విక్రయాలను దాటిన తొలి ఇండియన్ ఈవీగా నిలిచింది. టాటా విక్రయించిన మొత్తం 2.5 లక్షల కార్లలో సింహభాగం నెక్సాన్‌దే కావడం గమనార్హం. ప్రస్తుతం టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ వంటి వైవిధ్యమైన మోడళ్లు ఉన్నాయి.

భారత ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ ప్రస్తుతం 66 శాతం వాటాను కలిగి ఉంది. అంటే రోడ్డుపై వెళ్లే ప్రతి మూడు ఎలక్ట్రిక్ కార్లలో రెండు టాటా మోటార్స్‌వే ఉంటున్నాయి. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా 1,000కి పైగా పట్టణాల్లో టాటా ఈవీలు తిరుగుతున్నాయి. సుమారు 84 శాతం మంది కస్టమర్లు తమ ఈవీని ప్రధాన వాహనంగా వాడుతున్నారని, వీరంతా కలిపి ఇప్పటివరకు 500 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారని కంపెనీ వెల్లడించింది.

రాబోయే రెండేళ్లలో భారీ ప్లాన్స్! టాటా మోటార్స్ తన ఈవీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. 2026 ఆరంభంలో సరికొత్త సియెర్రా ఈవీ, అప్‌డేటెడ్ పంచ్ ఈవీ లాంచ్ కానున్నాయి. 2026 చివరలో ప్రీమియం సెగ్మెంట్‌లో అత్యంత విలాసవంతమైన అవిన్యా సిరీస్‌ను టాటా తీసుకురాబోతోంది. ఆర్థిక సంవత్సరం 2030 నాటికి 5 కొత్త ఈవీ బ్రాండ్‌లను ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా 10 లక్షల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News