Tata Motors : రిటైల్ అమ్మకాల్లో టాటా మోటార్స్ అద్భుతం.. హ్యుందాయ్, మహీంద్రాను వెనక్కి నెట్టి నెంబర్ 2 స్థానం.
Tata Motors : ఎలక్ట్రిక్ వాహన రంగంలో అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్న టాటా మోటార్స్ తాజాగా భారత ఆటోమొబైల్ రిటైల్ మార్కెట్‌లో ఒక కీలక విజయాన్ని నమోదు చేసింది. సెప్టెంబర్ 2025 నెల అమ్మకాల గణాంకాల ప్రకారం, టాటా మోటార్స్ దేశంలోనే రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వాహన విక్రయదారుగా నిలిచింది. ఈ స్థానం కోసం దశాబ్దకాలంగా పోటీపడుతున్న హ్యుందాయ్, మహీంద్రా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి టాటా ఈ ఘనత సాధించడం విశేషం.
వాహన్ పోర్టల్ అందించిన రిజిస్ట్రేషన్ల వివరాల ప్రకారం, టాటా మోటార్స్ సెప్టెంబర్ 2025లో మొత్తం 40,594 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య మహీంద్రా అండ్ మహీంద్రా (37,015 యూనిట్లు), హ్యుందాయ్ మోటార్ ఇండియా (35,443 యూనిట్లు) విక్రయాల కంటే ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలలో తెలంగాణ రాష్ట్ర డేటా చేర్చకపోయినా, ఈ రిపోర్ట్ టాటా మార్కెట్ పట్టును స్పష్టంగా సూచిస్తోంది. దేశంలో నెంబర్ 1 స్థానంలో మారుతి సుజుకి ఇండియా (1,22,278 యూనిట్లు) కొనసాగుతుండగా, టాటా మోటార్స్ రెండవ స్థానంలో నిలవడం ఆటో రంగంలో పెద్ద మార్పుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో చేసిన మార్పులు టాటా మోటార్స్‌కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, పండుగ సీజన్ ప్రారంభం కావడం వల్ల డీలర్ స్థాయిలో వాహనాలకు డిమాండ్ పెరిగింది. రిటైల్ అమ్మకాలతో పాటు టోకు అమ్మకాలలో కూడా టాటా మోటార్స్ దూకుడు చూపింది. సెప్టెంబర్‌లో టాటా మోటార్స్ 60,907 యూనిట్ల టోకు అమ్మకాలు నమోదు చేయగా (ఎలక్ట్రిక్ వాహనాలతో సహా), మహీంద్రా 56,000+ యూనిట్లు, హ్యుందాయ్ 51,547 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగాయి.
గత దశాబ్దకాలంగా భారత రిటైల్ మార్కెట్‌లో రెండవ స్థానాన్ని స్థిరంగా ఆక్రమించుకున్న హ్యుందాయ్ సంస్థకు ప్రస్తుతం గట్టి పోటీ ఎదురవుతోంది. దేశీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా తమ కొత్త మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాల పై భారీగా దృష్టి పెట్టడం వలన వారి మార్కెట్ వాటా వేగంగా పెరుగుతోంది. దీని ప్రభావంతో హ్యుందాయ్ అమ్మకాలు నెలవారీగా స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి తన వ్యూహాలను మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది.
జీఎస్టీ రేట్లపై అనిశ్చితి ఉన్నా, టాటా మోటార్స్ సెప్టెంబర్‌లో బలమైన పనితీరును ప్రదర్శించడానికి ప్రధాన కారణం దాని ద్వంద్వ వ్యూహంగా నిపుణులు పేర్కొంటున్నారు. టాటా కంపెనీ ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లు రెండింటిలోనూ బలమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. నెక్సాన్, పంచ్, టియాగో వంటి కాంపాక్ట్ కార్లు ఐసీఈ, ఈవీ రెండు ఆప్షన్లలోనూ లభించడం కంపెనీకి పెద్ద బలం. దేశంలో ఈవీ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న టాటా, భవిష్యత్తులో తన ఐకానిక్ మోడల్ అయిన సియెర్రాను తిరిగి మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇది టాటా మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.