Tata Motors : టాటా ఎస్‌యూవీలకు కొత్త పెట్రోల్ పవర్..హారియర్, సఫారీలకు అల్ట్రా ట్రీట్‌మెంట్.
Tata Motors : టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలలో మోస్ట్ అవేటెడ్ పెట్రోల్ వెర్షన్‌లను ప్రవేశపెట్టి మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు కేవలం డీజిల్ ఇంజిన్‌తోనే రాజ్యమేలిన ఈ రెండు దిగ్గజ వాహనాలు, ఇప్పుడు సరికొత్త హైపెరియన్ పెట్రోల్ ఇంజిన్‌తో వినియోగదారుల ముందుకు రానున్నాయి. ఈ కొత్త లాంచ్‌తో టాటా మోటార్స్ తన ప్రత్యర్థులైన మహీంద్రా XUV700, ఎంజీ హెక్టర్లకు గట్టి పోటీనివ్వడానికి సిద్ధమైంది. ఈ కొత్త పెట్రోల్ ఎస్‌యూవీలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లు, వేరియంట్ల గురించి తెలుసుకుందాం.
టాటా హారియర్, సఫారీ పెట్రోల్ వెర్షన్లలో అత్యంత శక్తివంతమైన 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ హైపెరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే ఇంజిన్‌ను మొదట టాటా సియెర్రాలో ప్రవేశపెట్టినప్పటికీ హారియర్, సఫారీ కోసం దీనిని మరింత పవర్‌ఫుల్‌గా ట్యూన్ చేశారు. సియెర్రాలో 160 bhp పవర్ ఇస్తుండగా, హారియర్, సఫారీలలో ఏకంగా 170 bhp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపుగా వీటి డీజిల్ వెర్షన్లతో సమానమైన శక్తిని అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్, స్మూత్ డ్రైవింగ్ కోసం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా మోటార్స్ ఈ పెట్రోల్ మోడల్స్‌తో పాటు అల్ట్రా అనే కొత్త టాప్-ఎండ్ వేరియంట్లను పరిచయం చేసింది. హారియర్ పెట్రోల్‌లో ఫియర్‌లెస్ అల్ట్రా, సఫారీ పెట్రోల్‌లో అకాంప్లిష్డ్ అల్ట్రా పేర్లతో ఇవి లభిస్తాయి. ఈ వేరియంట్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా శామ్సంగ్ నుంచి సేకరించిన 14-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సెక్యూరిటీ కోసం ఇన్-బిల్ట్ డాష్ క్యామ్ ఉన్న డిజిటల్ ఐఆర్‌వీఎం, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, కారు వెనుక కెమెరాను శుభ్రం చేయడానికి రివర్స్ కెమెరా వాష్ ఫంక్షన్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను జోడించారు.
లోపలి భాగం విషయానికి వస్తే, హారియర్ పెట్రోల్ వైట్-బ్రౌన్ డ్యూయల్-టోన్ కేబిన్‌తో క్లాసీగా కనిపిస్తుండగా, సఫారీ పెట్రోల్ గోల్డ్, వైట్ డ్యూయల్-టోన్ కేబిన్‌తో అత్యంత విలాసవంతంగా ఉంటుంది. వీటితో పాటు 65W ఫాస్ట్ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, ఇది ల్యాప్‌టాప్‌లను కూడా ఛార్జ్ చేయగలదు. స్టైల్ ఇష్టపడే వారి కోసం టాటా మోటార్స్ ఈ పెట్రోల్ వెర్షన్లను కూడా తమ పాపులర్ డార్క్, స్టీల్త్, రెడ్ డార్క్ ఎడిషన్లలో అందుబాటులోకి తెస్తోంది. డీజిల్ కారు కొనే ఆలోచన లేని వారికి, పవర్‌ఫుల్ పెట్రోల్ ఎస్‌యూవీ కోరుకునే వారికి ఈ కొత్త మోడల్స్ బెస్ట్ ఛాయిస్ కానున్నాయి.