Tata Sierra : 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. టాటా సియెర్రా రాకతో వణుకుతున్న మారుతి-మహీంద్రా.
Tata Sierra : టాటా మోటార్స్ తన సరికొత్త ఎస్‌యూవీ టాటా సియెర్రాను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. 2023 ఆటో ఎక్స్‌పోలో దీని నమూనాను మొదటిసారి చూపించారు. అప్పటి నుండి భారతీయ ప్రయాణీకుల వాహనాల మార్కెట్‌లో దీని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ నవంబర్ 25న పూర్తిగా కొత్తగా, ఆధునికమైన లుక్‌తో అదరగొట్టడానికి తిరిగి వస్తోంది. కొత్త టాటా సియెర్రా డిజైన్ పాత టాటా సియెర్రాను గుర్తుచేస్తుంది. అది 1991 నుండి 2003 మధ్య భారతీయ రోడ్లపై ఒక పాపులర్ ఎస్‌యూవీగా ఉండేది. మొదట పెట్రోల్-డీజిల్ ఇంజిన్‌తో నడిచే సియెర్రాను నవంబర్ 25న విడుదల చేస్తుంది. ఆ తర్వాత కొద్ది కాలానికి దాని ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుంది.
కొత్త టాటా సియెర్రా అతిపెద్ద ప్రత్యేకత దాని విలక్షణమైన డిజైన్ విధానం. పాత మోడల్ ప్రత్యేకత అయిన ఆల్పైన్ విండో ఇందులో ఉంటుంది. టాటా పాత మోడల్ క్లాసిక్ డిజైన్‌ను ఆధునిక స్టైలింగ్‌తో కలిపి ఈ ఎస్‌యూవీని మరింత ఆకర్షణీయంగా తయారు చేసింది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్ రైల్స్, స్పోర్టీగా ఉండే 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి సౌకర్యాలు లభించే అవకాశం ఉంది.
కొత్త టాటా సియెర్రా ఒక ప్రీమియం ఎస్‌యూవీగా మార్కెట్‌లోకి వస్తుంది. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ దీనిని అనేక అడ్వాన్సుడ్ టెక్నాలజీ, విలాసవంతమైన సౌకర్యాలతో నింపనుంది. ఇందులో లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, అనేక ఇతర హై-టెక్ సౌకర్యాలు ఉంటాయి. ఇవి ఈ ఎస్‌యూవీని తన విభాగంలోనే అత్యంత ఆధునికమైన వాటిలో ఒకటిగా నిలుపుతాయి.
కొత్త టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లతో సహా అనేక ఇంజిన్ ఆప్షన్లలో విడుదల అవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో కంపెనీ కొత్త 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను అందిస్తారు. దీనిని 2023 ఆటో ఎక్స్‌పోలో చూపించారు. తక్కువ స్థాయి వెర్షన్‌లలో ఇదే నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వెర్షన్ కూడా లభించవచ్చు. డీజిల్ వెర్షన్‌లో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందిస్తారు, ఇది ప్రస్తుతం టాటా కర్వ్ కారులో ఉపయోగించబడుతోంది.
టాటా సియెర్రా టాటా కర్వ్, టాటా హారియర్ మధ్య ఉండనుంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ.12 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ మీడియం రేంజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, కియా సెల్టోస్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.