TDS Rules 2026 : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్..లక్ష వడ్డీ వచ్చినా టీడీఎస్ కట్ అవ్వదు..15H మ్యాజిక్ ఇదే.

Update: 2026-01-10 12:30 GMT

TDS Rules 2026 : సాధారణంగా బ్యాంకులో మనం దాచుకున్న డబ్బుపై వచ్చే వడ్డీ ఒక పరిమితి దాటితే, బ్యాంకులు ఆ వడ్డీ నుంచి కొంత మొత్తాన్ని ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ రూపంలో ముందే కట్ చేస్తాయి. సాధారణ పౌరులకు ఈ పరిమితి రూ.40,000 కాగా, సీనియర్ సిటిజన్లకు మాత్రం ప్రభుత్వం రూ.1,00,000 వరకు వెసులుబాటు కల్పించింది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకు (లేదా పోస్టాఫీసు) నుంచి వచ్చే వడ్డీ లక్ష రూపాయల లోపు ఉంటే బ్యాంకులు టీడీఎస్ కట్ చేయవు.

నిపుణుల లెక్కల ప్రకారం.. మీరు ఒక బ్యాంకులో దాదాపు రూ.12 నుంచి రూ.13 లక్షలు ఎఫ్‌డీ చేస్తే (వడ్డీ రేటు 8% అనుకుంటే), మీకు ఏడాదికి సుమారు లక్ష రూపాయల వడ్డీ వస్తుంది. దీనిపై టీడీఎస్ పడదు. కానీ మీ ఇన్వెస్ట్‌మెంట్ అంతకంటే ఎక్కువగా ఉండి, వడ్డీ లక్ష దాటితే మాత్రం బ్యాంకులు 10 శాతం టీడీఎస్ కోస్తాయి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ ఇవ్వకపోతే ఏకంగా 20 శాతం కట్ చేస్తారు. అయితే, ఒక చిన్న ట్రిక్ తో దీని నుంచి తప్పించుకోవచ్చు. అదేమిటంటే.. మీ దగ్గర రూ.25 లక్షలు ఉంటే, అది ఒకే బ్యాంకులో వేయకుండా రెండు వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. అప్పుడు ఒక్కో బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ లక్ష లోపే ఉంటుంది కాబట్టి టీడీఎస్ కట్ అయ్యే ఛాన్సే ఉండదు.

మీ వడ్డీ లక్ష దాటినప్పటికీ, మీ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిమితి లోపే ఉంటే మీరు ఫామ్ 15H సమర్పించవచ్చు. ఇది సీనియర్ సిటిజన్లు బ్యాంకులకు ఇచ్చే ఒక డిక్లరేషన్ ఫామ్. "నాకు వచ్చే మొత్తం ఆదాయంపై ట్యాక్స్ పడదు, కాబట్టి నా ఎఫ్‌డీ వడ్డీపై టీడీఎస్ కట్ చేయకండి" అని దీని ద్వారా కోరవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఫామ్ ఇస్తే బ్యాంకులు రూపాయి కూడా కట్ చేయకుండా మొత్తం వడ్డీని మీ ఖాతాలో వేస్తాయి.

ఈ లక్ష రూపాయల లిమిట్ కేవలం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉండే ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తుంది. పొరపాటున ప్రైవేట్ కంపెనీల్లో లేదా ఇతర వడ్డీ వ్యాపారాల్లో వచ్చే ఆదాయానికి ఈ రూల్ వర్తించదు. అక్కడ కేవలం రూ.5,000 దాటితేనే టీడీఎస్ బాదుడు మొదలవుతుంది. కాబట్టి సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడులను పక్కాగా ప్లాన్ చేసుకుంటే, కష్టపడి సంపాదించిన వడ్డీ డబ్బులను టీడీఎస్ రూపంలో పోకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ పొరపాటున బ్యాంకులు టీడీఎస్ కట్ చేసినా, మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఆ డబ్బును వెనక్కి పొందవచ్చు.

Tags:    

Similar News