TESLA: భారత్‌కి టెస్లా ఎంట్రీ.. ముంబై తొలి షోరూమ్
భారత్‌లోకి అడుగుపెట్టను అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా;
అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్‌కి అడుగుపెడుతోంది. ముంబైలో తొలి షోరూం ఏర్పాటు చేసి, మోడల్ ‘వై’ రియర్ వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ విక్రయాలను జూన్ నెలలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెస్లా, భారత మార్కెట్‌పై ఫోకస్ పెంచింది. ప్రస్తుతం ముంబైలో తొలి షోరూం కోసం ప్రాంగణాల ఎంపిక పూర్తి కాగా, వాహనాలు, విడి భాగాల దిగుమతులు వేగంగా సాగుతున్నాయి. బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం, డిమాండ్ బాగుంటే టెస్లా ఢిల్లీలో రెండో షోరూం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించనుంది. ఈ నేపథ్యాన్ని ముందుగానే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సమయంలో టెస్లా భారత్ విస్తరణకు నాంది పలికినట్టు సమాచారం. దీనికి అనుగుణంగానే కంపెనీ కార్యాచరణలో వేగం పెంచింది.
ఎలాన్ మస్క్ వ్యూహాలు – భారత్‌దే నెక్ట్ ఫోకస్
యూరప్, చైనా వంటి దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ స్థిరపడిన నేపథ్యంలో, టెస్లా తదుపరి అభివృద్ధి కేంద్రంగా భారత్‌ను ఎంచుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నదాన్ని దృష్టిలో పెట్టుకొని, తక్కువ ధరలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే మోడల్ వై RWD ఎస్‌యూవీని మొదటగా ప్రవేశపెడుతోంది.
మోడల్ వై SUVకి ప్రస్తుతం అమెరికాలో అధిక డిమాండ్ ఉంది. ఇది మిడ్సైజ్ ఫైవ్ సీటర్ ఎస్‌యూవీగా, బ్యాటరీ రేంజ్ 455 కిలోమీటర్లు (EPA Estimate), 0-100 కి.మీ వేగాన్ని 6.6 సెకన్లలో అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 45 లక్షల నుంచి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి, కానీ అధికారికంగా ధరలు ఇంకా ప్రకటించలేదు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా – సూపర్ చార్జర్లు రవాణా
కేవలం కార్లను మాత్రమే కాదు, టెస్లా ఇప్పటికే భారత్‌కి భారీగా సూపర్‌చార్జింగ్ స్టేషన్లను, ఇతర కార్ యాక్సెసరీస్‌ను దిగుమతి చేస్తోంది. భారత రోడ్లకు అనుకూలంగా టెస్లా ప్రత్యేకంగా శిక్షణ పొందిన సాంకేతిక బృందాన్ని నియమించనుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెస్లా ఎంట్రీ వల్ల భారత్‌లో ఉన్న స్థానిక ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.
మేక్ ఇన్ ఇండియా కలకు కొత్తదనం?
వెనకటికి చూసినట్లయితే, భారత్‌లో ప్లాంటు స్థాపనపై టెస్లా ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ దిగుమతులపై ట్యాక్స్ రాయితీ అంశంలో ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన EV నూతన దిగుమతి విధానాలు టెస్లా లాంటి దిగ్గజాలను ఆకర్షించడానికి గణనీయంగా సహాయపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ముంబై షోరూమ్ విజయవంతం అయితే, కంపెనీ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో తన హవా చాటేందుకు సిద్ధమవుతోంది. అంతేకాక, ఫ్యూచర్ ప్లాన్‌లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభించేందుకు కూడావేలు వేస్తోంది.