New Sedans : సెడాన్ లవర్స్‌కు పండగే.. 2026లో రాబోతున్న 4 క్రేజీ కార్లు ఇవే.

Update: 2025-12-26 15:45 GMT

New Sedans : ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఎస్‌యూవీల గోలే కనిపిస్తోంది. టాటా సియెర్రా, కియా సెల్టోస్ వంటి కార్లు మార్కెట్‌ను ఊపేస్తున్నాయి. అయితే ఎస్‌యూవీల జోరు ఎంత ఉన్నా.. సెడాన్ కార్లకు ఉండే క్లాస్, కంఫర్ట్ వేరే లెవల్. అందుకే వచ్చే 2026 సంవత్సరంలో సెడాన్ లవర్స్ కోసం మార్కెట్లోకి నాలుగు అద్భుతమైన మిడ్-సైజ్ సెడాన్లు రాబోతున్నాయి. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల బడ్జెట్ ధరలో లభించే ఈ కార్లు సరికొత్త డిజైన్, హై-టెక్ ఫీచర్లతో ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమయ్యాయి.

1. హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్: భారత మార్కెట్లో సెడాన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు వెర్నా. 2026 రెండో త్రైమాసికం ప్రారంభంలో వెర్నా కొత్త వెర్షన్ లాంచ్ కానుంది. దీని డిజైన్ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సోనాటా నుంచి స్ఫూర్తి పొందింది. ముఖ్యంగా ముందు వైపు బంపర్, స్ప్లిట్ హెడ్‌లైట్స్, గ్రిల్ సరికొత్తగా ఉంటాయి. లోపల 12.3 ఇంచుల భారీ డిస్ప్లే, కొత్త ccNC ఆపరేటింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే వంటి అప్‌డేట్స్ ఉండనున్నాయి. ఇంజిన్ పరంగా ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్, టర్బో ఆప్షన్లే కొనసాగుతాయి.

2. స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్: యువతను ఎక్కువగా ఆకర్షించే స్లావియా, 2026 ద్వితీయార్థంలో కొత్త అవతారంలో రానుంది. ఇందులో లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు తోడవనున్నాయి. 360-డిగ్రీల కెమెరా, కొత్త అప్హోల్స్టరీ, రివైజ్డ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌తో ఇది మరింత లగ్జరీగా కనిపించనుంది. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు కానీ, గేర్ బాక్స్ లో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది.

3. వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్: స్లావియాకు సిస్టర్ కార్ అయిన వర్టస్ కూడా అదే సమయంలో అప్‌డేట్ కానుంది. జర్మన్ ఇంజనీరింగ్‌కు మారుపేరుగా నిలిచే ఈ కారులో కొత్త బంపర్లు, అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానున్నాయి. వర్టస్‌లో కూడా లెవల్-2 ADAS ఫీచర్లను జోడించడం ద్వారా భద్రతను మరో మెట్టు ఎక్కించబోతున్నారు. ముఖ్యంగా దీనిలోని 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌కు ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ స్థానంలో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ వచ్చే ఛాన్స్ ఉంది.

4. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్: సెడాన్ కింగ్ అని పిలవబడే హోండా సిటీలో కూడా చిన్నపాటి మార్పులు జరగనున్నాయి. 2026 ద్వితీయార్థంలో వచ్చే ఈ అప్‌డేట్‌లో కొత్త కలర్ ఆప్షన్లు, రీడిజైన్డ్ గ్రిల్, 16 ఇంచుల కొత్త అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, 2028లో హోండా సిటీ నెక్స్ట్ జనరేషన్ మోడల్ రాబోతున్నందున, ప్రస్తుతానికి ఇది ఒక చిన్నపాటి రిఫ్రెష్ మాత్రమే అని చెప్పాలి. హైబ్రిడ్ వెర్షన్ కూడా ఇందులో యథావిధిగా అందుబాటులో ఉంటుంది.

ఎస్‌యూవీల రద్దీలో విభిన్నంగా ఉండాలనుకునే వారికి, ఫ్యామిలీతో కలిసి హాయిగా ప్రయాణించాలనుకునే వారికి ఈ 4 సెడాన్లు 2026లో బెస్ట్ ఆప్షన్లు కానున్నాయి.

Tags:    

Similar News