Hydrogen Car : 5 నిమిషాల్లో ఫుల్ ట్యాంక్..భారత్‌లో తొలిసారి హైడ్రోజన్ కార్ టెస్టింగ్.
Hydrogen Car : దేశంలో కాలుష్యాన్ని తగ్గించి ఇంధన విషయంలో స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో భారత్ కీలక అడుగు వేసింది. టెక్ దిగ్గజం టయోటా, ప్రభుత్వ పరిశోధనా సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీతో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా టయోటా మిరాయ్ హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ కారును భారతీయ రోడ్లపై వాస్తవ వాతావరణ పరిస్థితుల్లో టెస్ట్ చేయడానికి వీలవుతుంది. హైడ్రోజన్‌తో నడిచే ప్యాసింజర్ కారుకు భారతదేశంలో పద్ధతి ప్రకారం డ్రైవింగ్, వాతావరణ పరీక్షలు చేయడం ఇది మొదటిసారి.
టయోటా తమ రెండో తరం మిరాయ్ కారును నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీకి అందించింది. ఈ కారు కంప్రెస్డ్ హైడ్రోజన్‌పై నడుస్తుంది. ఎగ్జాస్ట్ నుంచి కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సంస్థ ఈ కారును పలు అంశాలపై పరీక్షిస్తుంది.. మైలేజ్, రేంజ్, డ్రైవింగ్ అనుభవం, వివిధ రకాల రోడ్లపై, ఉష్ణోగ్రత పరిస్థితుల్లో కారు పర్ఫామెన్స్, హైడ్రోజన్ నింపే ప్రక్రియ, భారతీయ రోడ్లపై సాధారణంగా ఉండే ధూళి, ట్రాఫిక్ పరిస్థితుల ప్రభావం గురించి పరీక్షిస్తుంది.
ఈ ట్రయల్స్ నుంచి సేకరించిన డేటా భవిష్యత్తులో భారతదేశంలో హైడ్రోజన్ ఆధారిత కార్ల కోసం కొత్త విధానాలను రూపొందించడానికి కీలకంగా మారనుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఈ రంగంలో వాణిజ్య మార్గం నిర్ణయించబడలేదు. టయోటా కంపెనీ ప్రకారం.. ఈ కారు సుమారు 650 కి.మీ వరకు ప్రయాణించగలదు. 5.2-5.4 కిలోల హైడ్రోజన్‌తో పూర్తిగా నింపుకోవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రోజన్ ఆధారిత ఇంధన వ్యవస్థల పెద్ద ప్రణాళికలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఒక భాగం. మిషన్ డైరెక్టర్ అభయ్ భగారే మాట్లాడుతూ, దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనం స్థానంలో, భవిష్యత్తులో మనం స్వయంగా తయారు చేసుకున్న పునరుత్పాదక హైడ్రోజన్‌ను ప్యాసింజర్ కార్లతో సహా అన్ని రంగాలలో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టయోటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గులాటి కూడా మాట్లాడుతూ.. ఇంధనంలో స్వయం సమృద్ధి, కాలుష్య తగ్గింపు, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి పునరుత్పాదక శక్తి చాలా ముఖ్యమని, అందులో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.