TRADE BILL: భారత్-అమెరికా మధ్య 'మినీ ట్రేడ్ డీల్'
వాషింగ్టన్లో జోరుగా తుది దశ చర్చలు.. 48 గంటల్లో కీలక ఒప్పందం వచ్చేదేనా?;
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరుదేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ (మధ్యంతర వాణిజ్య ఒప్పందం) కుదరనున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాషింగ్టన్లో కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. వచ్చే 48 గంటల్లో ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశముందని జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంలో ప్రధానంగా వ్యవసాయం, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కీలక రంగాల్లో ఇప్పటికీ ఇరుదేశాల మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డెయిరీ రంగంలో భారత్ తన మార్కెట్‌ను విదేశీ కంపెనీలకు పూర్తిగా తెరిచేందుకు సిద్ధంగా లేకపోవడం వల్ల చర్చలు సవాలుగా మారాయి. మరోవైపు అమెరికా విద్యుత్తు కార్లు, వైన్స్, పెట్రోకెమికల్స్, యాపిల్స్, నట్స్ వంటి ఉత్పత్తులపై భారత్ తక్కువ టారిఫ్‌లు విధించాలంటూ ఒత్తిడి తెస్తోంది.
అమెరికా ప్రభుత్వం ఇప్పటికే భారత్ నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇది జులై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ ప్రభుత్వం మరోసారి ఈ మినహాయింపును పొడిగించే ఉద్దేశం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, భారత్ ఈ టారిఫ్‌లపై రాయితీలు కోరుతోంది. ప్రస్తుతం బేస్‌లైన్ టారిఫ్ 10 శాతంగా కొనసాగుతున్నా, అదనంగా విధించబోయే 26 శాతం పన్ను భారం భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇదే నేపథ్యంలో వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వాషింగ్టన్లో తుది విడత చర్చలు ప్రారంభించారు. టారిఫ్‌ల సస్పెన్షన్ గడువు ముగియడానికి ముందే ఈ ఒప్పందం కుదిరితే, ఇరుదేశాల వాణిజ్య సంబంధాల్లో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుంది. జులై 8 లోగా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మినీ ట్రేడ్ డీల్ ద్వారా భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న కొన్ని వాణిజ్య వివాదాలకు తాత్కాలిక పరిష్కారం దొరకొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీని ప్రభావం ఫార్మా, టెక్స్టైల్, వ్యవసాయ రంగాలపై కనిపించనుంది.