Triumph : స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కు పండగే.. ట్రయంఫ్ డేటోనా 660 పై ఏకంగా రూ.లక్ష ఆదా.
Triumph : బైక్ లవర్స్‌కు మరో క్రేజీ అప్‌డేట్. హోండా దారిలోనే బ్రిటీష్ దిగ్గజం ట్రయంఫ్ కూడా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. తన పాపులర్ స్పోర్ట్స్ టూరర్ బైక్ డేటోనా 660 పై ఏకంగా లక్ష రూపాయల భారీ డిస్కౌంట్‌ను కొన్ని డీలర్‌షిప్‌లలో అందిస్తోంది. లగ్జరీ స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా అదిరిపోయే శుభవార్త. సూపర్ బైక్స్ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేసిన ట్రయంఫ్ డేటోనా 660 ఇప్పుడు మరింత సరసమైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9,88,400 గా ఉంది. అయితే ఎంపిక చేసిన కొన్ని డీలర్‌షిప్‌లలో ఈ బైక్ పై రూ.1,00,000 వరకు నగదు తగ్గింపు లభిస్తోంది. ఇది కేవలం పరిమిత కాలం పాటు, కొన్ని యూనిట్లకే అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాబట్టి, ఈ డీల్ కొట్టేయాలనుకుంటే వెంటనే మీకు దగ్గరలోని అధికారిక షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.
ట్రయంఫ్ డేటోనా 660 లో 660cc ఇన్-లైన్ త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ వాడారు. ఇదే ఇంజిన్ ట్రైడెంట్ 660 లో కూడా ఉన్నప్పటికీ, డేటోనా కోసం దీనిని మరింత పవర్ ఫుల్ గా ట్యూన్ చేశారు. ఇది 11,250 rpm వద్ద 93.70 bhp గరిష్ట శక్తిని, 8,250 rpm వద్ద 69 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, రోడ్డుపై చిరుతపులిలా దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న మూడు రైడింగ్ మోడ్స్ (రోడ్, రెయిన్, స్పోర్ట్) డ్రైవర్ కు అద్భుతమైన కంట్రోల్ ఇస్తాయి.
ఈ బైక్ అస్థిపంజరం లాంటి ట్యూబులర్ స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్ చాలా ధృడమైనది. ముందు వైపు 41 mm అప్‌సైడ్ డౌన్ షోవా ఫోర్కులు, వెనుక వైపు షోవా మోనోషాక్ సస్పెన్షన్ ఉండటంతో ప్రయాణం చాలా స్మూత్ గా ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువేమీ కాదు. ప్రతి 16,000 కిలోమీటర్లకు లేదా ఏడాదికి ఒకసారి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. లాంగ్ ట్రిప్స్ వేయడానికి ఇష్టపడే వారికి ఈ స్పోర్ట్స్ టూరర్ బైక్ ఒక బెస్ట్ ఆప్షన్.
వేగానికి తగ్గట్టుగానే సేఫ్టీ ఫీచర్లను కూడా ట్రయంఫ్ పక్కాగా ప్లాన్ చేసింది. ముందు వైపు ట్విన్ 310 mm డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 220 mm సింగిల్ డిస్క్ బ్రేక్స్ అమర్చారు. వీటికి తోడు డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అదనపు భద్రతను ఇస్తాయి. మార్కెట్లో దీనికి పోటీగా కావసాకి నింజా 650, ఏప్రిలియా RS 660, సుజుకి GSX-8R వంటి దిగ్గజ బైకులు ఉన్నాయి. అయినా ట్రయంఫ్ బ్రాండ్ వాల్యూ, ప్రస్తుత డిస్కౌంట్ ఈ బైక్‌ను రేసులో ముందు నిలబెడుతున్నాయి.