Triumph Daytona 660 : బంపర్ ఆఫర్.. 3 రైడింగ్ మోడ్స్ ఉన్న ఈ స్పోర్టీ బైక్ ఇప్పుడు రూ.లక్ష తక్కువకే!

Update: 2025-12-10 14:30 GMT

Triumph Daytona 660 : ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తమ డేటోనా 660 మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌పై భారత మార్కెట్లో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 2024 లో భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ మోటార్‌సైకిల్‌పై ఇప్పుడు డీలర్‌షిప్ ఆధారంగా రూ.లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ తగ్గింపు పూర్తిగా డీలర్ స్థాయి ఆఫర్ అని, కాబట్టి ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని గమనించాలి. ప్రస్తుతం ట్రయంఫ్ డేటోనా 660 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.88 లక్షలుగా ఉంది. ఈ ధర కవాసకి నింజా 650 వంటి ప్రత్యర్థుల కంటే కొంచెం ఎక్కువ. రూ.లక్ష తగ్గింపు తర్వాత, డేటోనా 660 ధర దాదాపు రూ.8.88 లక్షలకు తగ్గుతుంది.

రూ.లక్ష తగ్గింపు తర్వాత కూడా ఈ మోటార్‌సైకిల్ దేశంలో అమ్ముడవుతున్న కొన్ని ఎంట్రీ-లెవల్ కార్ల కంటే ఖరీదైనదిగా ఉంది. ముఖ్యంగా దీని ధర ప్రముఖ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన మారుతి సుజుకి బాలెనో(ప్రారంభ ధర రూ.5.99 లక్షలు ఎక్స్-షోరూమ్) కంటే, మారుతి సుజుకి బ్రెజా (రూ.8.25 లక్షలు) లేదా టాటా నెక్సన్ (రూ.7.32 లక్షలు) వంటి ఎస్‌యూవీల కంటే కూడా ఎక్కువగా ఉంది. అయితే, ఇది ట్రిపుల్-సిలిండర్ స్పోర్ట్స్ బైక్ కాబట్టి, దీన్ని కార్లతో నేరుగా పోల్చలేం. మార్కెట్‌లో దీనికి హోండా సీబీఆర్ 650ఆర్(రూ.11.16 లక్షలు) వంటి ఖరీదైన ఆప్షన్లు కూడా పోటీగా ఉన్నాయి.

ట్రయంఫ్ డేటోనా 660 లో 660 సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇదే ఇంజిన్ ట్రైడెంట్ 660 మరియు టైగర్ స్పోర్ట్ 660 మోడళ్లలో కూడా ఉపయోగించారు. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ 11,250 ఆర్‌పీఎమ్ వద్ద 95 హార్స్‌పవర్ శక్తిని మరియు 8,250 ఆర్‌పీఎమ్ వద్ద 69 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. సులభమైన గేర్ షిఫ్టింగ్‌ల కోసం, ఈ మోటార్‌సైకిల్‌లో స్లి, అసిస్ట్ క్లచ్ కూడా ఇవ్వబడింది.

డేటోనా 660 సీటు ఎత్తు 810 మిమీగా ఉంది. ఇది టైగర్ స్పోర్ట్ కంటే 25 మిమీ తక్కువగా, ట్రైడెంట్ 660 కంటే 5 మిమీ ఎక్కువగా ఉంది. భారత మార్కెట్లో ఈ బైక్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి స్నోడొనియా వైట్ విత్ సఫైర్ బ్లాక్, సాటిన్ గ్రానైట్ విత్ సాటిన్ జెట్ బ్లాక్, కార్నివాల్ రెడ్ విత్ సఫైర్ బ్లాక్.. ఇందులో 14 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఇది ట్రైడెంట్ 660 కు సమానంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు (రైన్, రోడ్, స్పోర్ట్) ఉన్నాయి.

ట్రయంఫ్ డేటోనా 660 లో ట్యూబులర్ స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్ ఉపయోగించారు. సస్పెన్షన్ కోసం ముందువైపు 41 మిమీ షోవా యూఎస్‌డీ ఫోర్క్, వెనుక వైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. బ్రేకింగ్ కోసం ముందువైపు రెండు 310 మిమీ డిస్క్‌లు, వెనుకవైపు ఒక 220 మిమీ డిస్క్ ఉన్నాయి. ఇందులో మిచెలిన్ పవర్ 6 టైర్లతో కూడిన తేలికపాటి కాస్ట్ అల్యూమినియం వీల్స్ అమర్చారు.

Tags:    

Similar News