Upcoming Cars : కారు కొనాలని తొందర పడకండి బాసూ..ఆర్నెళ్లు ఆగితే అన్నీ కొత్త మోడల్స్ వచ్చేస్తాయి.
Upcoming Cars : ప్రస్తుత కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీలదే అగ్రస్థానం. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా కంపెనీలు తమ కార్లకు మిడ్-లైఫ్ అప్‌డేట్స్ ఇస్తున్నాయి. ఈ ఏడాది సుమారు 9 పాపులర్ మోడళ్లు కొత్త ఫీచర్లతో రాబోతున్నాయి. వీటిలో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో N
మహీంద్రా తన పవర్‌ఫుల్ ఎస్‌యూవీ స్కార్పియో Nకు అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. కొత్త వెర్షన్‌లో ముందు డిజైన్ పూర్తిగా మారే అవకాశం ఉంది. లోపల పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అందరూ కోరుకునే పానోరమిక్ సన్ రూఫ్ రాబోతోంది. ముఖ్యంగా లెవల్-2 అడాస్ ఫీచర్లు ఉండటం వల్ల సేఫ్టీ విషయంలో స్కార్పియో N ఇప్పుడు మరో మెట్టు పైకి ఎక్కనుంది.
మారుతి బ్రెజ్జా 2026
మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ బ్రెజ్జాలో మెకానికల్ మార్పులు చేయబోతోంది. ఇందులో అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీ రాబోతోంది. దీనివల్ల సీఎన్‌జీ కార్లలో సామాన్లు పెట్టుకోవడానికి స్థలం ఉండదు అన్న ఫిర్యాదు ఇక ఉండదు. అలాగే, ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఏడాస్ (ADAS) ఫీచర్లు ప్రవేశపెట్టడం విశేషం.
టాటా పంచ్ EV
టాటా మోటార్స్ తన సక్సెస్‌ఫుల్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ EVని అప్‌గ్రేడ్ చేస్తోంది. కొత్త మోడల్‌లో నెక్షాన్ EV లో ఉండే 45 kWh బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని సమాచారం. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. అంతేకాకుండా 360-డిగ్రీ కెమెరా, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు దీనికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
హ్యుందాయ్ వెర్నా, ఎక్స్టర్
హ్యుందాయ్ తన సెడాన్ రారాజు వెర్నాను గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో అప్‌డేట్ చేస్తోంది. దీని ముందు భాగం సోనాటా కార్ల మాదిరిగా చాలా ప్రీమియంగా ఉండబోతోంది. అలాగే మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టర్ కూడా కొత్త కలర్స్, బెటర్ ఇంటీరియర్ మెటీరియల్‌తో మార్చి తర్వాత లాంచ్ కానుంది.
స్కోడా కుషాక్, స్లావియా
స్కోడా కంపెనీ తన కుషాక్ ఎస్‌యూవీని మార్చి 2026లో లాంచ్ చేయనుంది. ఇందులో కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వస్తోంది. డిజైన్ పరంగా కొత్త గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, పానోరమిక్ సన్ రూఫ్ ఉండబోతున్నాయి. కుషాక్ తర్వాత ఇదే తరహా మార్పులతో స్లావియా సెడాన్ కూడా రాబోతోంది.