UPI Business : యూపీఐ ఫ్రీ అంటున్నాం.. మరి ఈ కంపెనీలకి వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

Update: 2026-02-24 06:30 GMT

UPI Business : నేడు భారతదేశంలో జేబులో పైసా లేకపోయినా పర్వాలేదు కానీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. టీ కొట్టు దగ్గర రూపాయి నుంచి షాపింగ్ మాల్‌లో వేల రూపాయల వరకు అంతా యూపీఐమయం. ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న చెల్లింపుల్లో 57 శాతం కేవలం యూపీఐ ద్వారానే సాగుతున్నాయి. అయితే మనందరికీ ఒక సందేహం రావచ్చు. మనం ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటీఎం ద్వారా డబ్బులు పంపినప్పుడు మన దగ్గర ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు కదా? మరి ఈ కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది? వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో బర్న్‌స్టెయిన్ నివేదిక బయటపెట్టింది.

యూపీఐ లావాదేవీల సంఖ్య పరంగా చూస్తే వ్యక్తుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్లే ఎక్కువ. కానీ వీటి వల్ల కంపెనీలకు వచ్చే ఆదాయం 10 శాతం కంటే తక్కువ. అసలైన ఆదాయం అంతా వ్యాపారుల ద్వారానే వస్తోంది. కంపెనీల మొత్తం సంపాదనలో 75 శాతం వాటా వ్యాపారుల లావాదేవీలదే. మనం ఏదైనా దుకాణంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినప్పుడు, ఆ వ్యాపారి నుంచి ఈ ప్లాట్‌ఫారమ్‌లు నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ ద్వారా కంపెనీలకు భారీ లాభాలు వస్తున్నాయి. సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్ల కంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై ఈ యాప్ కంపెనీలు ఎక్కువ ఫీజును పొందుతాయి.

వీటితో పాటు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చేసే కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, రీఛార్జీల వల్ల కూడా వీరికి మంచి కమీషన్లు లభిస్తాయి. ఇక చిన్న చిన్న దుకాణాల్లో మనం వినే సౌండ్‌బాక్స్ లు, స్వైపింగ్ మెషీన్లు ఈ కంపెనీలకు నిరంతర ఆదాయాన్ని ఇచ్చే వనరులు. వీటిని వ్యాపారులకు అద్దెకు ఇవ్వడం ద్వారా కేవలం 2025 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరింది. బ్యాంకింగ్ ఫీజులు, టెక్నాలజీ ఖర్చులు పోను ఈ ఏడాది ఈ రంగంలో సుమారు రూ.15,000 కోట్ల నికర ఆదాయం ఉండవచ్చని అంచనా.

వచ్చే ఐదేళ్లలో ఈ ఆదాయం ఏటా 20 శాతం చొప్పున పెరిగి, 2030 నాటికి రూ.38,500 కోట్లకు చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం కేవలం డెబిట్ అకౌంట్ నుంచి మాత్రమే డబ్బులు పంపిస్తున్నాం, కానీ రాబోయే రోజుల్లో క్రెడిట్ ఆధారిత చెల్లింపులు (ముఖ్యంగా రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ) పెరిగితే ఈ కంపెనీల లాభాలు రెట్టింపు అవుతాయి. అయితే ఒక్కో కస్టమర్ మీద వచ్చే ఆదాయం చూస్తే అది చాలా తక్కువగా ఉంటుంది. సగటున ఒక యూజర్ నుంచి ఈ కంపెనీలు ఏడాదికి రూ.300 లోపే సంపాదిస్తాయి. కానీ కోట్ల మంది యూజర్లు ఉండటంతో అది భారీ మొత్తంగా మారుతోంది. మొత్తానికి మనం ఫ్రీగా వాడుతున్నాం అనుకుంటున్న ఈ సర్వీస్ వెనుక ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యమే దాగి ఉంది.

Tags:    

Similar News