E-Waste Recycling : డబ్బులు కురిపిస్తున్న ఈ-వేస్ట్.. 6 బిలియన్ డాలర్ల బిజినెస్‌పై భారత్ కన్ను
E-Waste Recycling : అవసరమే ఆవిష్కరణకు మూలం అన్న మాట ఈ విషయంలో అక్షరాలా నిజమవుతోంది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల కొండల నుంచి భారత్ ఇప్పుడు తెల్లబంగారం వెలికితీస్తోంది. స్మార్ట్‌ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు, ఎలక్ట్రిక్ కార్ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు ప్రతిచోటా వాడే లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల కోసం భారత్ ఇప్పుడు పాత బ్యాటరీల వైపు మొగ్గు చూపుతోంది. మన దేశంలో గనుల ద్వారా ఈ ఖనిజాలను వెలికితీయడానికి కనీసం మరో దశాబ్దం పట్టే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం అర్బన్ మైనింగ్ (నగరాల్లోని వ్యర్థాల నుంచి ఖనిజాల సేకరణ) పై దృష్టి సారించింది.
హర్యానాలోని ఎక్సిగో రీసైక్లింగ్ వంటి భారీ ప్లాంట్లలో ఇప్పుడు పాత ఈ-స్కూటర్ బ్యాటరీలను ఒక క్రషింగ్ మెషీన్ ద్వారా నల్లటి పౌడర్‌గా మారుస్తున్నారు. ఆ తర్వాత దీనిని రసాయనిక ప్రక్రియల ద్వారా వడపోసి, మరిగించి చివరకు తెల్లటి పొడిలా ఉండే లిథియంను తయారు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనినే వైట్ గోల్డ్ (తెల్ల బంగారం) అని పిలుస్తున్నారు. ఈ అర్బన్ మైనింగ్ విలువ ఏడాదికి సుమారు 6 బిలియన్ డాలర్లు (రూ.50 వేల కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. ఇది విదేశాల నుంచి వచ్చే దిగుమతి భారానికి చెక్ పెట్టడమే కాకుండా, సరఫరా గొలుసును బలోపేతం చేస్తుంది.
గత ఏడాది భారత్ సుమారు 1.5 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. అంటే సుమారు 2 లక్షల చెత్త ట్రక్కులను నింపేంత అన్నమాట. అయితే ఇందులో అత్యధిక భాగం ఇప్పటికీ అసంఘటిత రంగంలో (చిన్న చిన్న షాపులు, కబీలాల్లో) ప్రాసెస్ అవుతోంది. అక్కడ కేవలం రాగి, అల్యూమినియం వంటి వాటినే తీసుకుని, అత్యంత విలువైన లిథియం, నికెల్ వంటి ఖనిజాలను వదిలేస్తున్నారు. అంతేకాకుండా, బహిరంగంగా కాల్చడం వల్ల పర్యావరణానికి, కార్మికుల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రీసైక్లింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి 170 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది.
ప్రధానంగా ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ నిబంధనలు వచ్చిన తర్వాత పరిస్థితి మారుతోంది. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే కంపెనీలే ఆ వ్యర్థాలను సేకరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన రీసైక్లర్లకు అందించాలి. ఢిల్లీలోని సీలంపూర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ స్థాయిలో ఇన్ఫార్మల్ రీసైక్లింగ్ జరుగుతున్నప్పటికీ, ఎటేరో రీసైక్లింగ్ వంటి కంపెనీలు సుమారు 22 రకాల కీలక ఖనిజాలను వెలికితీయగలమని చెబుతున్నాయి. ఇన్ఫార్మల్ రంగాన్ని కూడా వ్యవస్థీకృతం చేయగలిగితే భారత్ కీలక ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధి సాధించడం ఖాయం.