Debit Card EMI : డెబిట్ కార్డ్ EMI వాడుతున్నారా? ఈ ఒక్క చిన్న తప్పు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.

Update: 2025-10-26 11:45 GMT

Debit Card EMI: ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఉంటేనే ఈఎంఐలో వస్తువులు కొనేవారు. ఇప్పుడు బ్యాంకులు డెబిట్ కార్డ్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అంటే, క్రెడిట్ కార్డ్ లేకపోయినా, మీ డెబిట్ కార్డుతో టీవీ, మొబైల్ వంటి ఖరీదైన వస్తువులను వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డులు ఇష్టం లేని వారికి ఇది చాలా ఉపయోగకరమైన అవకాశం.

బ్యాంకులు మీ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు, మీ లావాదేవీల చరిత్ర ఆధారంగా ఒక ఈఎంఐ లిమిట్ నిర్ణయిస్తాయి (రూ.5,000 నుండి రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ). మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఈ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి నెలా నిర్ణీత తేదీన ఈఎంఐ మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుండి ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది.

డెబిట్ కార్డ్ ఈఎంఐ సాధారణంగా మీ సిబిల్ స్కోర్‌పై నేరుగా ప్రభావం చూపదు. ఎందుకంటే ఇది మీ సొంత డబ్బుతో తీసుకున్న లోన్ లాంటిది. అయితే, ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది.. కొన్ని బ్యాంకులు ఈ ఈఎంఐలను చిన్నపాటి లోన్గా పరిగణించి, ఆ సమాచారాన్ని సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి.

మీరు క్రమంగా ఈఎంఐలు కడితే... బ్యాంకు సిబిల్ కు సమాచారం పంపినప్పుడు, మీరు ప్రతి ఈఎంఐని సమయానికి చెల్లిస్తే, అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో మంచి పాయింట్‌గా నమోదవుతుంది. మీరు బాధ్యత గల వ్యక్తి అని సిబిల్ కు తెలుస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది.

ఒక తప్పు చేస్తే... సిబిల్ కు సమాచారం పంపే బ్యాంక్ లో మీరు ఒక నెల ఈఎంఐ కట్టడంలో ఆలస్యం చేసినా లేదా మీ ఖాతాలో డబ్బు లేక ఈఎంఐ బౌన్స్ అయినా, అది మీ సిబిల్ స్కోర్‌పై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీ స్కోర్ ఒక్కసారిగా పడిపోతుంది. ఇది మీ క్రెడిట్ రిపోర్ట్‌పై నెగిటివ్ మార్క్‌లా ఉంటుంది.

బ్యాంకు సిబిల్ కు సమాచారం పంపకపోయినా, ఈఎంఐ బౌన్స్ అయితే బ్యాంక్ జరిమానా వసూలు చేస్తుంది. అంతేకాకుండా, పదేపదే ఈఎంఐలు బౌన్స్ అయితే, భవిష్యత్తులో మీకు లోన్ అవసరమైనప్పుడు బ్యాంక్ మీ దరఖాస్తును తిరస్కరించవచ్చు.

డెబిట్ కార్డ్ ఈఎంఐ సౌకర్యం చాలా ఉపయోగకరమైనదే అయినా, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే, మీ బ్యాంక్ ఖాతాలో ఈఎంఐ కట్ అయ్యే తేదీకి సరిపడా డబ్బు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీకు భవిష్యత్తులో ఆర్థికంగా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Tags:    

Similar News