VinFast VF6 : అదరగొట్టిన విన్‌ఫాస్ట్ VF6.. భారత్ NCAP టెస్టులో అదిరిపోయే 5-స్టార్ రేటింగ్.
VinFast VF6 : భారతదేశంలో వాహనాల భద్రతను పరీక్షించే భారత్ ఎన్‌క్యాప్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో 2025లో భారత విపణిలో అడుగుపెట్టిన విన్‌ఫాస్ట్ VF6, తన పవర్ ఏంటో చూపించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రెండింటిలోనూ అద్భుతమైన స్కోర్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది.
భారత్ NCAP స్కోర్లు
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పెద్దల రక్షణ విభాగంలో 32 పాయింట్లకు గాను 27.13 పాయింట్లు సాధించింది. ఇక పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 44.41 పాయింట్లు పొంది తన పటిష్టతను చాటుకుంది. అయితే ఫ్రంటల్ ఆఫ్ సెట్ టెస్టులో డ్రైవర్ ఛాతీ భాగంలో రక్షణ కొంత మేర బలహీనంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సైడ్ ఇంపాక్ట్ టెస్టులో మాత్రం ఇది పూర్తి స్థాయిలో స్కోరు చేసి ఔరా అనిపించింది.
టాప్ సేఫ్టీ ఫీచర్లు
విన్‌ఫాస్ట్ VF6లో ఉన్న అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు దీనిని అద్భుతమైన కారుగా మార్చాయి
7 ఎయిర్‌బ్యాగ్‌లు: ఇందులో డ్రైవర్ మోకాలి ఎయిర్‌బ్యాగ్ కూడా ఉండటం విశేషం.
లెవల్-2 ADAS: ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
360° కెమెరా: పార్కింగ్ సమయంలో, ఇరుకైన రోడ్లపై 360 డిగ్రీ హెచ్‌డీ వ్యూ లభిస్తుంది.
ISOFIX మౌంట్లు: వెనుక సీట్లలో పిల్లల సేఫ్టీ కోసం ప్రత్యేక మౌంట్లు అమర్చారు.
ESC & AIS-100: ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ నిబంధనలను ఇది పాటిస్తుంది.
ధర, పోటీ
విన్‌ఫాస్ట్ VF6 భారత్‌లో ఎర్త్, విండ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.16.49 లక్షల నుంచి రూ.18.29 లక్షల మధ్య ఉంది. ఈ ధరలో ఇది కేవలం హ్యుందాయ్ క్రెటా ఈవీకే కాకుండా, టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ మోడళ్లకు కూడా గట్టి సవాల్ విసురుతోంది. ముఖ్యంగా 463 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వడం ఈ కారుకు మరో అదనపు బలం.
మొత్తానికి విన్‌ఫాస్ట్ కంపెనీ భారతీయ వినియోగదారులకు కావాల్సిన విధంగా స్టైల్, రేంజ్, ముఖ్యంగా భద్రతను జోడించి VF6ను మార్కెట్లోకి తెచ్చింది. ఒక విదేశీ సంస్థ భారత్ NCAPలో ఇలాంటి స్కోరు సాధించడం ద్వారా దేశీయ మార్కెట్ పై తనకున్న నిబద్ధతను చాటుకుంది.