Wedding Gift Tax : పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్‌లకు కూడా ట్యాక్స్ కట్టాలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

Update: 2025-11-21 06:45 GMT

Wedding Gift Tax : పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితంలో అత్యంత ముఖ్యమైన, మర్చిపోలేని ఘట్టం. మన సంప్రదాయంలో బంధువులు, స్నేహితులు నూతన వధూవరులకు బహుమతులు ఇవ్వడం అనేది సాధారణ ఆచారం. అయితే ఆదాయపు పన్ను నియమాల ప్రకారం.. కొన్ని రకాల బహుమతులకు ట్యాక్స్ వర్తిస్తుంది. గిఫ్ట్ ట్యాక్స్ నియమాల ప్రకారం.. దగ్గరి బంధువులు కాని వ్యక్తుల నుంచి రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతి అందితే ఆ మొత్తంపై పన్ను కట్టాల్సి ఉంటుంది. అందుకే పెళ్లిలో బంగారం ఇతర విలువైన వస్తువులు గిఫ్ట్‌గా అందుకుంటే ఈ నియమం వర్తించే అవకాశం ఉంది.

ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి?

పెళ్లిలో అందుకున్న బహుమతిపై ఎప్పుడు, ఎలా పన్ను కట్టాలి అనే విషయంలో స్పష్టత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు బహుమతి ఇచ్చిన వ్యక్తి దగ్గరి బంధువు కాకపోతే ఆ బహుమతి విలువ రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే మీరు దానిని మీ ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. అటువంటి గిఫ్ట్‌ను ITR దాఖలు చేసేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే విభాగంలో తప్పనిసరిగా చూపించాలి. దగ్గరి బంధువుల నుంచి వచ్చిన బహుమతులకు మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. వాటిని ITR లో నమోదు చేయవలసిన అవసరం లేదు.

పెళ్లి సందర్భంగా బంధువుల నుంచి గిఫ్ట్ వచ్చి దానికి పన్ను మినహాయింపు కావాలంటే పన్ను అధికారులు అడిగినప్పుడు కొన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. పెళ్లి ఇన్విటేషన్ కార్డు, గిఫ్ట్ ఇచ్చిన వారి జాబితా, బహుమతికి సంబంధించిన మెసేజ్ లేదా ఈమెయిల్, బ్యాంక్ స్టేట్‌మెంట్, అలాగే గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఫోటోలు లేదా వీడియో వంటి ఆధారాలు మీ దగ్గర ఉండాలి. పన్ను అధికారులు ప్రశ్నించినప్పుడు వీటిని సమర్పించవచ్చు.

గిఫ్ట్‌లను అమ్మినప్పుడు పన్ను

పెళ్లిలో వచ్చిన బహుమతిని భవిష్యత్తులో అమ్మినప్పుడు, దానిపై వచ్చే లాభానికి మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. అంటే, మీరు గిఫ్ట్‌గా పొందిన ఆస్తిని (ఉదాహరణకు బంగారం లేదా భూమి) కొంత కాలం తర్వాత అమ్మినప్పుడు లాభం వస్తే, ఆ లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పెళ్లి అనేది శుభకార్యమే అయినా, బహుమతుల విషయంలో పన్ను నియమాలను తెలుసుకుని అందుకు తగినట్లుగా ఐటీఆర్ దాఖలు చేయడం చాలా ముఖ్యం.

Tags:    

Similar News