Car Design Cost : కారు డిజైన్ కోసమే అన్ని కోట్లా? వేరే కంపెనీని కాపీ కొడితే ఏమవుతుంది?

Update: 2025-12-27 10:15 GMT

Car Design Cost : మనం ఏదైనా కొత్త కారును చూసినప్పుడు మొదట మనల్ని ఆకట్టుకునేది దాని డిజైన్. ఆ కారు ఎంత స్టైలిష్‌గా ఉంది, ఎంత మోడ్రన్‌గా కనిపిస్తుందనే అంశాలే కస్టమర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అందుకే కార్ల కంపెనీలు కేవలం కారు డిజైన్ కోసం కోట్ల రూపాయలు, కొన్నిసార్లు వేల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తాయి. అసలు ఒక కారు డిజైన్ వెనుక ఇంత కథ ఉంటుందా? వేరే కంపెనీ కారును కాపీ కొట్టి తయారు చేస్తే సరిపోతుంది కదా? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. కానీ ఒక కొత్త కారు డిజైన్ వెనుక ఏళ్ల తరబడి పడే కష్టం, చట్టపరమైన చిక్కులు చాలా ఉంటాయి.

డిజైన్ అంటే కేవలం బాడీ కాదు

చాలామంది కారు డిజైన్ అంటే కేవలం బయట కనిపించే బాడీ షేప్ మాత్రమే అనుకుంటారు. కానీ అందులో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఏరోడైనమిక్స్, సేఫ్టీ, ఇంజనీరింగ్ వంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఒక కారు డిజైన్ పూర్తి కావడానికి సాధారణంగా 4 నుంచి 6 ఏళ్ల సమయం పడుతుంది. ఈ ప్రాసెస్ లో క్లే మోడల్స్ (మట్టితో చేసే నమూనాలు), కంప్యూటర్ సిమ్యులేషన్స్, క్రాష్ టెస్టులు, ప్రొటోటైప్ తయారీకి కంపెనీలు భారీగా వెచ్చిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కారు రోడ్డు మీదకు రాకముందే దాని డిజైన్ కోసమే సగం బడ్జెట్ ఖర్చవుతుంది.

బ్రాండ్ ఇమేజ్.. డిజైన్ పేటెంట్స్

ఒక కారును చూడగానే అది ఏ కంపెనీదో చెప్పేలా ఉండటమే బ్రాండ్ పవర్. ఉదాహరణకు BMW కిడ్నీ గ్రిల్, మెర్సిడెస్ త్రీ-పాయింట్ స్టార్, టాటా మోటార్స్ కొత్త డిజైన్ లాంగ్వేజ్ వాటికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. మరి వేరే కంపెనీ కారును కాపీ చేయవచ్చు కదా అంటే అక్కడే డిజైన్ పేటెంట్ అడ్డు వస్తుంది. కారు బాడీ షేప్, హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ నుంచి ఇంటీరియర్ లోని చిన్న చిన్న ఎలిమెంట్స్ వరకు అన్నింటికీ చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఒకవేళ ఏ కంపెనీ అయినా మరో కంపెనీ డిజైన్‌ను కాపీ చేస్తే, భారీ జరిమానాలు పడటమే కాకుండా ఆ కారు అమ్మకాలపై కోర్టులు స్టే విధిస్తాయి.

సేఫ్టీ,టెక్నాలజీ

ఈ రోజుల్లో కార్లు కేవలం అందంగా ఉంటే సరిపోదు, అవి అంతర్జాతీయ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కారు డిజైన్ చేసేటప్పుడే అది ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్న వారిని ఎలా కాపాడుతుంది, గాలిని చీల్చుకుంటూ ఎంత వేగంగా వెళ్తుంది (ఏరోడైనమిక్స్) వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. ఒక కంపెనీ కారు డిజైన్‌ను మరో కంపెనీ ప్లాట్‌ఫామ్ మీద వాడటం టెక్నికల్‌గా సాధ్యం కాదు. ఒకవేళ బలవంతంగా కాపీ చేసినా, ఆ కారు సేఫ్టీ టెస్టుల్లో విఫలమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రతి కంపెనీ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, భద్రతను నిర్మించుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడి కొత్త డిజైన్లను రూపొందిస్తాయి.

Tags:    

Similar News