Rolls-Royce : రోల్స్ రాయిస్ ఎందుకు ఇంత అంత ఖరీదు.. ఒక కారు తయారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా ?
Rolls-Royce : రోల్స్ రాయిస్ (Rolls-Royce) కార్లను ఎల్లప్పుడూ లగ్జరీ కార్లకు పెట్టింది పేరుగా భావిస్తారు. అద్భుతమైన లగ్జరీ, పర్ఫామెన్స్, అమూల్యమైన డిజైన్, ఫీచర్లు, హస్తకళ, స్పెషాలిటీ అన్నీ కలిసి కోట్లలో ధర ఉండే ఒక కారును తయారు చేస్తాయి. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షే, వోల్వో వంటి లగ్జరీ కార్ల కొనుగోలుదారులు ఎక్కువ ఉన్నప్పటికీ, రోల్స్ రాయిస్ ఇప్పటికీ తన ప్రత్యేక గుర్తింపు నిలుపుకుంది. రోల్స్ రాయిస్ కార్లు నేటికీ కేవలం ఒక వాహనం కాదు, స్టేటస్ సింబల్‌గా పరిగణించబడతాయి. రోల్స్ రాయిస్ కార్ల ఇంత ఎక్కువ ధర వెనుక ఉన్న కారణాలను మీరు తెలుసుకుందాం.
ప్రతి రోల్స్ రాయిస్ కారు ఒక స్పెషల్ మోడల్. దీనిని కస్టమర్ అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ కార్లను తయారు చేసేటప్పుడు ఏది పడితే అది పెట్టరు. ప్రతి రోల్స్ రాయిస్ కారును కస్టమర్ కోరుకున్నట్లుగా, అతని ఇష్టాలకు తగ్గట్టుగా తయారు చేస్తారు. అందుకే ఇవి చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్కరి కోసం ఒక్కోటి తయారు చేయడం, తక్కువ సంఖ్యలో మాత్రమే ప్రొడ్యూస్ చేయడం వల్ల దీనికి అంత డిమాండ్.
ఒక రోల్స్ రాయిస్ కారు పూర్తిగా రెడీ అవ్వాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. అదీ వందల గంటల పాటు కష్టపడితేనే. దీని వెనుక నైపుణ్యం కలిగిన కళాకారుల హస్తకళ ఉంటుంది. సీట్లు చేతితో కుడతారు. చెక్క పార్ట్స్‌ను చేతితో పాలిష్ చేస్తారు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. స్టార్‌లైట్ హెడ్‌లైనర్ రోల్స్ రాయిస్ సిగ్నేచర్ ఫీచర్. కారు పైకప్పు మీద 1,600 వరకు చిన్న చిన్న ఫైబర్ ఆప్టిక్ లైట్లను చేతితో అల్లుతారు. కస్టమర్ కోరుకున్న స్టార్ ఆకృతిని సృష్టిస్తారు. రాత్రి పూట స్టార్ గెజింగ్ చేసినట్లు ఉంటుంది. కారు బాడీపై పక్కన ఉండే సన్నటి గీతను ఓ ఎక్స్‌పీరియన్స్డ్ ఆర్టిస్ట్ చేతితో పెయింట్ చేస్తారు. కస్టమర్లు ఏకంగా 44,000 కంటే ఎక్కువ పెయింట్ ఆప్షన్‌ల నుంచి ఎంచుకోవచ్చు. లేదంటే తమకు నచ్చిన ప్రత్యేకమైన రంగును డిజైన్ చేయించుకోవచ్చు. కారుకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావడానికి దాదాపు 10 వారాలు పడుతుంది, 22 దశల్లో పెయింటింగ్ చేస్తారు. కారు కోసం ప్రపంచం నలుమూలల నుండి అరుదైన కలప, స్వచ్ఛమైన తోలును తెప్పిస్తారు. క్వాలిటీ విషయంలో రాజీ పడరు.
రోల్స్ రాయిస్ కేవలం చూడటానికి మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగానూ అద్భుతం. ఈ కార్లు వేగం గురించి ఎక్కువ ఆలోచించవు. స్మూత్, నిశ్శబ్దంగా, అద్భుతమైన రైడ్ ఇవ్వడం మీదే ఫోకస్. V12 ఇంజిన్‌లు చాలా పవర్‌ఫుల్. యాక్సలరేషన్ చాలా సాఫీగా ఉంటుంది. పవర్ తక్కువైందనే ఫీలింగ్ అస్సలు రాదు. ఈ కార్లలో కూడా రోడ్డుని ముందుగానే స్కాన్ చేసే అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. రోడ్డు ఎలా ఉన్నా సరే, రైడ్‌ను దానికి తగ్గట్టుగా మార్చేస్తుంది. కంపెనీ వాళ్లు దీన్ని మ్యాజిక్ కార్పెట్ రైడ్ అంటారు. అంటే, రోడ్డు మీద ఎత్తుపల్లాలు ఉన్నా సరే, కారు లోపల ఉన్నవారికి అస్సలు తెలియదు. ఒక పట్టు పరుపు మీద వెళ్తున్నట్లు ఉంటుంది.
కారు లోపల సౌండ్ రాకుండా సౌండ్‌ప్రూఫింగ్, డబుల్-గ్లేజ్‌డ్ విండోస్ ఉంటాయి. బయట ప్రపంచం నుండి ఎలాంటి శబ్దం లోపలికి రాదు. కారు లోపల వాతావరణం చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. రోల్స్ రాయిస్ కొనేవారికి ఇది కేవలం ఒక వాహనం కాదు, అది వారి హోదా, ప్రతిష్టకు ఒక చిహ్నం. దీని అధిక ధర కేవలం తయారీ ఖర్చు వల్లనే కాదు. అది ఒక స్ట్రాటజిక్ ప్రైసింగ్. కంపెనీ కావాలనే ధరను ఎక్కువగా ఉంచుతుంది. ఎందుకంటే అది అల్టిమేట్ లగ్జరీ వస్తువుగా ఉండాలి. ఈ ఎక్కువ ధర దాని గుర్తింపులో ఒక భాగం. జనాల్లో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారిని ఈ కారు ఆకర్షిస్తుంది.