కన్నడ హీరో శ్రీ మురళి నటించిన సినిమా బఘీర. డాక్టర్ సూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. సప్తసాగరాలు దాటి సినిమా బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 31న తెలుగులోనూ విడుదల కాబోతోన్న బఘీర నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు. విశేషం ఏంటంటే.. ఇది లిరికల్ సాంగ్ కాదు. వీడియో సాంగ్. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. ఈ గీతాన్ని రాంబాబు గోసాల రాయగా రితేష్ జి రావు ఆలపించాడు.
‘ప్రతి ఉదయం వెతికే కన్నులే.. నిను చూసి నిలిచే చూపులే.. తేనెల చినుకుల తీపి ఊసులే.. ’అంటూ సాగే ఈ మాంటేజ్ సాంగ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన హీరో క్యారెక్టరైజేషన్ ను బాగా ఎలివేట్ చేశారు. రుక్మిణి డాక్టర్ పాత్రలో కనిపించబోతోందని అర్థం అవుతుంది. ఈ పాటలోనే ఓ సన్నివేశంలో పోలీస్ గా కొందరు ఆకతాయిలపై చేయి చేసుకున్న సందర్భంగా వేలికి గాయం అవుతుంది. కానిస్టేబుల్ కర్చీఫ్ ఇచ్చినా.. రక్తం కారుతున్న వేలుతోనే హాస్పిటల్ కు వెళ్లి హీరోయిన్ తో కట్టు కట్టించుకునే సీన్ బలే ఉంది. పాట ఆసాంతం ఆడియో పరంగానూ, వీడియో పరంగానూ చూస్తున్నంత సేపూ హాయిగా అనిపించింది.