A rare honor for Akkineni : అక్కినేనికి అరుదైన గౌరవం

Update: 2024-09-04 10:24 GMT

అక్కినేని నాగేశ్వరరావు .. తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని స్థానం ఉన్న నటుడు. చివరి శ్వాస వరకూ నటించిన ఏకైక స్టార్. తెలుగు సినిమాకు రెండు కళ్లు అంటే ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నారే. ఎన్నో పాత్రలను ఆ చంద్రతారార్కం వెలిగించిన నటుడు ఏఎన్నార్. దేవదాస్ లాంటి పాత్ర ఎన్ని భాషల్లో ఎవరు చేసినా.. అక్కినేని దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేకపోయారు. అలాగే భక్తుడి పాత్రలు అంటే ఆయన తర్వాతే ఇంకెవరైనా. పౌరాణిక, చారిత్రక, నవలా నాయకుడుగా తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్నారాయన. మాస్ కటౌట్ లేకపోయినా మాస్ చేతా విజిల్స్ వేయించుకున్న హీరో అక్కినేని. అలాంటి గొప్ప నటుడి శతజయంతి సందర్భంగా ఫిలిమ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఓ అరుదైన గౌరవాన్ని ఏఎన్నార్ కు కట్టబెట్టబోతోంది.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన 10 అత్యుత్తమ చిత్రాలను దేశంలోని 22 నగరాల్లో ఈ నెల 20 నుంచి 22 వరకూ ప్రదర్శించబోతోంది. ఇందులో హైదరాబాద్ తో పాటు వరంగల్, కాకినాడ, బెంగళూరు, ఢిల్లీ, రూర్కెలా, తమకూరు, జలంధర్, వడోదర వంటి నగరాలున్నాయి.ఇక ఆ పది అత్యుత్తమ చిత్రాలను కూడా ఎంపిక చేశారు. విశేషం ఏంటంటే.. ఈ పదిలో మూడు సినిమాల్లో ఎన్టీఆర్ కూడా ఉన్నారు.దేవదాసు, మాయా బజార్, భార్య భర్తలు, గుండమ్మ కథ, సుడిగుండాలు, డాక్టర్ చక్రవర్తి, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకంతో పాటు ఆయన చివరి చిత్రం మనం ఉన్నాయి.


ఫిలిమ్ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి గతంలో దేవానంద్, అమితాబ్ బచ్చన్ చిత్రాలను కూడా ఇలాగే ఎంపిక చేసి ప్రదర్శించారు. అప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి అక్కినేని చిత్రాలకు కూడా అలాంటి స్పందనే వస్తుందేమో చూడాలి. 

Tags:    

Similar News